calender_icon.png 2 August, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్‌రూమ్ కల‘కలం’!

15-05-2025 01:15:10 AM

  1. చిన్న గూడూరు లో ఇండ్లు ఇప్పిస్తామని 1.70 కోట్ల రూపాయలు వసూల్
  2. దళారి దందాపై కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్ విలేకరుల పాత్ర పై విమర్శలు
  3. మానుకోట జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ంజూరులో ఇదే లొల్లి

మహబూబాబాద్, మే 14(విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో నిలువ నీడలేని పేదలకు పక్కా ఇల్లు కట్టించాలని లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ఆశించినంతగా ప్రయోజనం చేకూర్చకపోగా, దళారులకు దండిగా డబ్బులు పోగేసుకునే అవకాశం దక్కిందనే విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తామని అమాయకులైన నిరుపేదల నుంచి 1.70 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన ఎప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.

అయితే ఇందులో కొందరు పత్రికా విలేకరుల పాత్ర ఉందని విషయం బయటపడింది. ఈ ఘటనపై చిన్న గూడూరు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేయడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర కల‘కలం’ సృష్టిస్తోంది.

చిన్న గూడూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వం 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. మండల కేంద్రంలో ఇందుకోసం స్థలాన్ని కేటాయించి, 504 లక్షల రూపాయలు నిధులతో నిర్మాణ పనులకు 2022లో అప్పటి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ శంకుస్థాపన చేశారు. పనులను పూర్తి చేసిన తర్వాత గ్రామసభ ద్వారా అర్హులైన నిలువ నీడలేని పేదలను గుర్తించి వారికి ఇండ్లను కేటాయించాల్సి ఉంటుంది.

అయితే ఇందుకు భిన్నంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మీకే ఇస్తామని కొందరు అమాయకుల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఒక్కో ఇంటి కోసం 1.70 లక్షల చొప్పున కోటి 70 లక్షలు వసూలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం జాప్యం కావడం, ఎన్నికలు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబ్బులు ఇచ్చిన పేదలు, డబ్బులు తీసుకున్న వారిపై ఒత్తిడి పెంచడంతో చేసేదేమీ లేక కొందరు కొంత ఖర్చుల కింద మినహాయించుకుని తిరిగి ఇచ్చేయగా, ఇంకొందరు ఇవ్వకపోవడం, ఇండ్లు ఇప్పించే పరిస్థితి లేకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి ప్రవేశించారు.

దీనితో ఎవరికి కేటాయించకుండానే కొందరు వెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో చేరారనే విషయాన్ని చిన్నగూడూరు తహసిల్దార్ ఘటనాస్థలికి వెళ్లి వారిని ఖాళీ చేయాలని, ఎవరికి ఇండ్లు కేటాయించలేదని చెప్పగా, ఇండ్లలో చేరిన వారంతా ఖాళీ చేసేది లేదని, తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని, తమను ఖాళీ చేయాలని బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుంటామని అధికారుల ముందు నిరసనకు దిగడంతో వెంటనే తహసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో విలేకరుల పేర్లు ఉండడం ఎప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

ఎవరు చెబితే వసూలు చేశారు?

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 1.70 లక్షల రూపాయల చొప్పున ఏకంగా కోటీ 70 లక్షలు వసూలు చేయడం వెనుక ఎవరు ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. స్థానిక నాయకులు, విలేకరులు ఇంత పెద్ద ముడుపుల బాగోతం నిర్వహించారంటే ఎవరు విశ్వసించడం లేదు. పూర్తిగా రాజకీయ పెద్దల జోక్యంతోనే ఈ వ్యవహారం నడిచిందనే విమర్శలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడం, ఐదుగురుపై కేసు నమోదు ఇద్దరు అరెస్టు కావడం వెనుక కూడా రాజకీయ కోణం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా అర్హులైన పేదలకు ఇండ్లు దక్కకుండా, మధ్య దళారుల ప్రమేయంతో ఎగరేసుకుపోయే వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 

జిల్లాలో ఇతర చోట్ల కూడా ఇదే తరహా వసూళ్ళు?

ఒక్క చిన్న గూడూరు లోనే కాకుండా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హాయంలో ఇతర చోట్ల మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కూడా ఇదే తరహాలో లక్షల రూపాయలు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా స్థలం లేదని, స్థలం కొనడానికి డబ్బులు ఇస్తే ఇండ్లు కట్టించి ఇస్తామని, ఒక్కొక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

ఇక మరికొన్ని చోట్ల ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఇల్లు నిర్మాణం పూర్తి కాదని, మీరు కొంత ఇస్తే తప్ప నిర్మాణం పూర్తి చేయలేమని, లేదంటే నాణ్యత లేని ఇసుక సిమెంటు కంకర వినియోగించాల్సి వస్తుందని చెప్పి లబ్ధిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇక మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్ నిర్మాణ పనులను అర్ధాంతరంగా వదిలేసి వెళ్లగా, అసంపూర్తిగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులే సొంత ఖర్చులు భరించి పూర్తి నిర్మాణం పూర్తి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీనితో చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేదలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి దూరం కావాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఇలాంటి వ్యవహారాల వెనుక అప్పటి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించిన వారి కనుసన్నల్లోనే జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో డబ్బుల వ్యవహారం ముడిపడడంతో బీఆర్‌ఎస్ నేతల అండ ఉన్నవారికి, కాస్త కూస్తో ఆర్థికంగా ఉన్నవారు డబ్బులు చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కించుకున్నారని,

నిజమైన నిలువ నీడలేని పేదలకు మొండి చెయ్యి చూపారని విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, కేటాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిజాలు అన్ని బయటకు వస్తాయని భావిస్తున్నారు. 

అర్హులైన వారికి కేటాయించాలి 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలువ నీడలేని ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో అమలు చేస్తున్న నిబంధనల మేరకే జిల్లాలో ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని పేదలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హాయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనర్హులకు దక్కకుండా కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇండ్ల కేటాయింపు వ్యవహారంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల పెద్ద భవంతులు ఉన్నవారే మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దక్కించుకున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి.