calender_icon.png 15 May, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

15-05-2025 12:35:28 AM

  1. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణం
  2. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము..
  3. హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధాని మోదీ, తదితర ప్రముఖులు
  4. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత, మొదటి బౌద్ధ వ్యక్తిగా కీర్తి

న్యూఢిల్లీ, మే 14: సుప్రీంకోర్టు 52వ ప్రధా న న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(బీఆర్ గవాయ్) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, తదితర అతిథులు హాజరయ్యారు.

ఈసందర్భంగా ఆయ నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. సీజేఐగా ఆయన ఆరు నెలలు కొనసాగి నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తి, అలాగే మొదటి బౌద్ధ సీజేఐ కావడం విశేషం. గవాయ్ కుటుంబం అంబేద్కర్ నుంచి స్ఫూర్తిపొంది బౌద్ధమతాన్ని అనుసరిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి, విధులను నమ్మకంగా నిర్వర్తించడానికి తన నిబద్ధతను హిందీలో ప్రతిజ్ఞ చేస్తూ ఆయన పదవీ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తన తల్లికి పాదాభివందనం చేశారు. 

మురికివాడనుంచి..

మహారాష్ట్రలోని అమరావతి ఫ్రేజార్‌పురా ప్రాంతంలోని ఒక మురికివాడలో గవాయ్ 1960 నవంబర్ 24న  జన్మించారు. ఆయన తల్లి కమల్‌తాయ్ గవాయ్, తండ్రి ఆర్‌ఎస్(రామకృష్ణ సూర్యభాన్) గవాయ్. ఈయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(గవాయ్)ను స్థాపించారు. గవాయ్ ఆయన ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడు.  1985 మార్చి 16న న్యాయవాదిగా బీఆర్ గవాయ్ వృత్తి జీవితం ప్రారంభించారు.

1987 నుంచి 1990వరకు బాంబే హైకోర్టులో సొంత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆయన ప్రధానంగా నాగ్‌పూర్ బెంచ్‌లో తన వృత్తిని నిర్వర్తించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితో పాటు నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

గవాయ్ ఇచ్చిన కీలక తీర్పులు..

గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకుని రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.

* మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్ ఆర్టికల్ 370, ఎలక్టోరల్ బాండ్లు, రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో సహ విప్లవాత్మక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగంగా ఉన్నారు.

* ఒక మహిళా రొమ్ములు పట్టుకుని ఆమె పైజామాను లాగడం అత్యాచారయత్నం కాదంటూ అలహాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించి ఇది అమానవీయ విధానం అని పేర్కొంది.

* సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన కులాల అభ్యున్నతికి రిజర్వేషన్లు మంజూరు చేయడానికి, ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని తీర్పు చెప్పిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో గవాయ్ భాగస్వాములు.

* షోకాజ్ నోటీసులు లేకుండా ఏ ఆస్తిని కూల్చరాదని, బాధితుడు స్పందించడానికి 15 రోజుల సమయం ఇవ్వాలని గవాయ్ తీర్పు ఇచ్చారు.

v మోదీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీ దోషిగా నిర్ధారించడాన్ని నిలిపివేశారు.

v 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు బెయిల్ మంజూరు చేయడం.