calender_icon.png 21 November, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్వలు ఇలా.. నీరు పారేదెలా?

25-07-2024 01:10:59 AM

  • చెత్త, చెట్లతో నిండిపోయిన ఫతేనహర్ కాల్వ 
  • చివరి ఆయకట్టుకు నీరు అందడం ప్రశ్నార్థకమే

పాపన్నపేట, జూలై 24: ఆయకట్టు భూములకు సాగు నీరందించే కాల్వల్లో చెత్తాచెదారం చేరింది. నీరు ముందుకెళ్లకుండా పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడం ప్రశ్నార్థకంగా మారింది. పాపన్నపేట మం డల రైతులకు వ్యవసాయానికి అవసరమయ్యే నీటిని అందించేందుకు ఉన్న ప్రధా న నీటి వనరు మండల పరిధిలోని మంజీరా నదిపై ఉన్న ఘనపురం ఆనకట్ట. ఈ ఆనకట్టకు ఉన్న రెండు ప్రధాన కాల్వలైన మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాల్వల నుంచి పాపన్నపేట, కొల్చారం, మెదక్ మండలాల చెరువులకు నీరు సరఫరా అవుతుంది.

అయితే, పాపన్నపేట మండలానికి ఫతేనహర్ కాల్వ ద్వారా నాగ్సాన్‌పల్లి, ఎల్లాపూర్, పోడ్చన్‌పల్లి, అన్నా రం, గాంధారిపల్లి, లక్ష్మీనగర్, కొత్తపల్లి, యూసుఫ్‌పేట, దౌలాపూర్, కుర్తివాడ, మిన్‌పూర్ తదితర గ్రామాల్లోని 18 చెరువులకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల ద్వారా 10,200 ఎకరాల విస్తీర్ణం సాగవుతుంది. అయితే, ఫతేనహర్ ప్రధాన కాల్వ మరమ్మతులకు 2022లో నిధులు మం జూరైనప్పటికీ మొత్తం పనులు పూర్తికాకపోవడంతో అక్కడక్కడ పూడిక పేరుకుపోవడంతో పాటు చెత్తచెదారంతో కాల్వ నిండిపోయింది.

దీంతో నీరు చివరి ఆయకట్టుకు చేరుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతుల అవసరాల కోసం సిం గూరు నుంచి నీటిని ఘనపురం ఆనకట్టకు విడుదల చేస్తారు. ఇక్కడి నుంచి రెండు ప్రధాన కాల్వల ద్వారా చెరువులను నింపేందుకు విడుదల చేస్తుంటారు. వీటిని కాల్వల ద్వా రా రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

చివరికి చేరేనా..?

ఈ కాల్వల ద్వారా వచ్చే నీటితోనే రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకుంటారు. ఏడుపాయల ప్రధాన ఆనకట్ట నుంచి కాల్వల్లో నీరు ప్రవహించి చివరి ఆయకట్టును చేరుకోవాలి. ప్రస్తుతం కాల్వ పరిస్థితి వల్ల నీరు చివరికి చేరుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మండలంలో రైతులు ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే అవసరాలకు నీరు పంటకు ఎలా అందుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాభావ పరిస్థితుల వల్ల సకాలంలో వరి నాట్లు పడలేదని, ఇప్పుడు కాల్వల ద్వారా నీరు సకాలంలో అందకపోతే పంటకు నీటి తడుల విషయంలో ఇబ్బందులు తప్పేలా లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు కాల్వలను బాగు చేసి చివరి ఆయకట్టుకు నీటిని అందించాలని కోరుతున్నారు. 

చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

కాల్వ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఫతేనహర్ కాల్వవ చివరి ఆయకట్టు గ్రామాలైన కుర్తివాడ, గాంధారిపల్లి, పొడ్చన్‌పల్లి గ్రామాలకు గత సీజన్‌లో నీరందించాం. ఈ సీజన్‌లో కూడా నీరందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. రైతులకు ఆందోళన అవసరం లేదు. ఆయకట్టు పరిధిలోని అన్ని గ్రామాల చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.

 -విజయ్, ఏఈ, నీటిపారుదల శాఖ