calender_icon.png 24 January, 2026 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేకుర్తి భూముల విషయంలో సెక్రటేరియట్ వరకు పాదయాత్ర

24-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, జనవరి 23 (విజయ క్రాంతి): రేకుర్తి భూముల విషయంలో రేకుర్తి నుండి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తామని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 18వ డివిజన్ లోని రేకుర్తి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటి60 లక్షల ఏడిఎఫ్ నిధులతో రేకుర్తి ప్రధాన రోడ్డు నుండి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు.. రోడ్డు నిర్మాణంతో పాటు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... ఉత్తర తెలంగాణలోనే మేడారం తర్వాత అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారక్క జాతర రేకుర్తిలో కొనసాగుతుందని, ఈ జాతరకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునీ మొక్కులు చెల్లించుకుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

రేకుర్తి ప్రజలు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని, 22 ఏ కింద రేకుర్తిలో గల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. తద్వారా తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూములను వారి వారి అవసరాల కోసం అమ్ముకుందామంటే.. అమ్మడానికి... కొనడానికి.. వీలు లేకుండా నిషేధిత జాబితాలో పెట్టడంతో సుమారు 1000 నుండి 2000 మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళుతానని వారు చెప్పారన్నారు. ఎన్నికలు పూర్తయ్యే లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే.. రేకుర్తి భూ బాధితులతో కలిసి రేకుర్తి నుండి హైదరాబాద్ సెక్రటేరియట్ కు వెళ్లి సీఎంను కలుస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు మాధవి- కృష్ణ గౌడ్, ఎదుల్ల రాజశేఖర్, రేకుర్తి సమ్మక్క సారక్క ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు రాజేందర్, శేఖర్, పటేల్ సుధీర్ రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.