calender_icon.png 24 August, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం

24-08-2025 07:45:16 PM

నల్లమల పర్యటనలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

అచ్చంపేట: రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ తోపాటు నల్లమల ప్రాంతంలోని పలు చెంచు పెంటలు గ్రామాల్లో పర్యటించి పలు గ్రామపంచాయతీలు అంగన్వాడి నూతన భవనాలకు శంకుస్థాపనలు చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తుందన్నారు.

ప్రత్యేకంగా చెంచు సమాజానికి చెందిన 836 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి అర్హత గల కుటుంబానికి నూతనంగా ఇండ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. పదర మండలం కండ్లకుంట భూమి సమస్యను ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.