calender_icon.png 2 September, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసు దోచిన మహాకవి

12-06-2024 12:00:00 AM

‘ఆయన రెండంచుల పదునైన కత్తి వంటివారు. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతాన్నీ కురిపించగలరు..’ అక్షర సత్యాలవంటి ఈ ప్రశంసాపూర్వక కితాబును పొందిన వ్యక్తి ఎవరో కాదు ‘జ్ఞానపీఠ పురస్కార’ గ్రహీత, మన తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ, మహాకవి డా॥ సి.నారాయణరెడ్డి. ఈ మాటలు అన్నది అప్పటికే ‘వచన కవితా పితామహుడు’గా పేరెన్నికగన్న కుందుర్తి ఆంజనేయులు. ఇంకా లోలోపలికి వెళ్లి చూస్తే అసలు, సినారె మేధస్సుకు రెండంచులు మాత్రమే కాదు, బహుళ పార్శాలు. పద్యం, గద్యం, గేయం, గజళ్లు, వచన కవితలు, నాటికలు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, యాత్రా సాహిత్యం, బుర్రకథ.. ఇలా అనేక ప్రక్రియల్లో ఏడు దశాబ్దాల కాలం ఆయన సొంతం.

పాతికేళ్ల వయసు నుంచి 86 ఏళ్ల ప్రాయం వరకు ఆయన సృష్టించిన సాహిత్య సంపద అనన్య సామాన్యం. వారి ప్రతీ పదంలో, వాక్యంలో ఎంత సృజనో అంత గాఢత. ఎంత లోతైన భావుకతో అంత సామాజిక బాధ్యత. మానవత్వం నుంచి జాతీయత వరకు అడుగడుగునా మూర్తీభవించిన స్ఫూర్తి! అటు పండితుల మనసులను, ఇటు పామరుల హృదయాలను అలవోకగా దోచుకున్న సినారె సాహిత్యంలోనే కాక నిజ జీవితపరంగానూ తరతరాలకు మార్గదర్శకమవుతూనే ఉంటారు.

తొంభై మూడు సంవత్సరాల కిందట (1931 జూలై 29న) నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామం హనుమాజీపేటలో నారాయణరెడ్డి జన్మించారు. బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి దంపతులకు సినారెకంటే ముందు ఒక మగపిల్లవాడు పుట్టి కాలం చేశాడు. దాంతో ఇంట్లో ‘సత్యనారాయణ వ్రతం’ అవుతున్న వేళ బుచ్చమ్మ, ‘కొడుకు పుట్టి, క్షేమంగా వుంటే తన పేరు పెట్టుకుంటానని’ మొక్కుకుంది. స్వామి కనికరించి మగబిడ్డను ప్రసాదించాడు. ఆ బాలుడే మన ‘సినారె’గా అద్భుతాలు సృష్టించారు. 

ఇంతింతై వటుడింతై..

‘సత్యనారాయణరెడ్డి’ కాలక్రమంలో ఆడి తప్పని ‘సత్య’వ్రతాన్ని తన జీవితానికి వర్తింపజేసుకొని, నారాయణరెడ్డి పేరుతో సుప్రసిద్ధుడై నారు. నిజాం వ్యతిరేక ఉద్యమం సహా దేశ స్వాతంత్య్రం కోసం ‘సత్యాగ్రహం’లోనూ యువ సినారె పాల్గొన్నారు. ఇంట్లో సాహిత్య వాతావరణం లేకున్నా రచనా వ్యాసంగం వైపు మళ్లారు. పల్లెవారు అలవోకగా పాడుకొనే పాటలు, పద్యాల వైపు ఆయన మనసు లాగింది. హరికథలను లీనమైపోయి వినేవారు. ఆరేడు తరగతుల్లో వున్నప్పుడే పౌరాణిక నాటికలు స్వయంగా రచించి, స్నేహితులతో కలిసి ప్రదర్శించారు కూడా.

21 ఏళ్ల వయసులో ‘సాగుమా, ఓ నీల మేఘమా! గగన వీణా మృదుల రావమా..’ అన్న మృదుమధుర గీతం అప్పట్లో రేడియోలో ప్రసారమై బాగా పేరు తెచ్చిపెట్టింది. అలా సాహిత్య వ్యాసంగం పట్ల  ఆసక్తి అంతకంతకూ పెరిగి, మహావృక్షంగా ఎదిగింది. ఇరవై ఏళ్లనుంచి ముప్పయేళ్ల వరకు పదేళ్ల కాలంలో నారాయణరెడ్డి తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ఒకవైపు అధ్యాపక వృత్తి, మరోవైపు సాహిత్య వ్యాసంగం. అందివచ్చిన సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1961లో సినీ గీతరచనకు శ్రీకారం చుట్టారు. 

‘గులేబకావళి’ కథకు అప్పటికే ఒక కవితో ఓ పాట రాయించిన ఎన్టీఆర్ మన సినారె అభిమతాన్ని మన్నించి, మొత్తం పాటలూ రాయించడానికి అంగీకరించారు. ‘కలల అలలపై తేలెను..’ ఆయన మొదటి సినీ గీతమైనా, తొట్టతొలిగా రికార్డయింది మాత్రం ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’. 1952లో బి.ఏ. ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా విధులు నిర్వహించారాయన. తర్వాత ఆ సంఘానికి అధ్యక్షుడయ్యారు.

తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని వెదజల్లారు. సినారె ఎదుగుదల ఎంత గొప్పదంటే, వారికి విద్యనేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానిలతో కలిసి ఆచార్యులుగానూ పనిచేశారు. యాభైఏడేళ్ల ప్రాయంలోనే ఆయన కవితా విశ్వరూపాని (‘విశ్వంభర’)కి ‘జ్ఞానపీఠ పురస్కారం’ లభించింది. వేలాది సినిమా పాటల్లో దాదాపు ప్రతీ గీతమూ ఒక అద్భుత సందేశాన్నిచ్చేదే. వయసుతోపాటు ఆయనలో కవితా చైతన్యం రోజురోజుకూ వికసించిందే తప్ప, ఏనాడూ  కనీస విశ్రాంతి ఎరగదు. 

పాఠం చెప్పడం నుంచి గేయాలు రాయడం వరకు, సాహిత్య సభలలో ఉపన్యసించడం నుంచి కొత్త కవిత్వం సృష్టించడం వరకు, అధికార భాషా సంఘానికి అధ్యక్షుడి నుంచి రాజ్యసభ సభ్యుని వరకు, ఏడు దశాబ్దాల సినారె సుసంపన్నమైన జీవనయానంలో ఎన్నో మైలురాళ్లు, ఇంకెన్నో అనితర సాధ్యాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. 2017 జూన్ 12న కాలం ఆయనను భౌతికంగా మనకు దూరం చేసేంత దాకా అనుక్షణం వారి ధ్యాసంతా కవితా వ్యవసాయం వైపే. ఇంతటి అక్షర కృషీవలుణ్ణి కన్న తెలంగాణ నేల భాగ్యమే భాగ్యం కదా!

 దోర్బల బాలశేఖరశర్మ