12-06-2024 12:00:00 AM
విద్యా వినయ హేతురింద్రియ జయః
కామక్రోధలోభ మాన మద హర్షత్యాగాత్ కార్యః
కౌటిల్యుడు
విద్య వినయానికి హేతువు కావాలి. వినయం అరిషడ్వర్గాన్ని జయించినప్పుడే అలవడుతుంది. జయించడం అంటే వాటిని గురించిన సమగ్రమైన అవగాహనను కలిగి వుండడం. అవసరం లేని వాటిని త్యజించడం. విద్య, వినయం కలిస్తే విజయం. కౌటిల్యుని అర్థశాస్త్రం- మొదటి అధికరణం- ఆరవ ఆధ్యాయం-లోని తొలి శ్లోకానికి భావం ఇది.
సాధారణంగా ఉన్నత స్థితికి చేరడం కష్టమనుకుంటే, ఆ స్థానాన్ని నిలుపుకోవడం మరింత కష్టతరమైంది. ఉన్నత స్థానాన్ని చేరుకున్న వ్యక్తిని చుట్టూ ఉండే సమాజం జాగ్రత్తగా గమనిస్తూ వుంటుంది. విజయ సాధకులను సమాజం ఎంతగా ఆకాశానికి ఎత్తుతుందో అవకాశం వస్తే అంతగా కిందికి లాగేస్తుంది. అందుకే, ఉన్నత స్థానాన్ని చేరాలనుకునే వ్యక్తి ముందుగా తనపై తాను విజయాన్ని సాధించాలి. మనిషిని పడద్రోసే అంత:శత్రువులు ఆరు. అవే కామం, క్రోధం, లోభం, మానం, మదం, హర్షం. చర్మం, కళ్లు, చెవులు, నాలుక, ముక్కు వీటిని ఇంద్రియాలుగా చెపుతారు. వీటిద్వారా స్పర్శ, రూప, శబ్ద, రస, గంధాల అనుభవాలను అనుభవిస్తాం. ఇవి సహజరీతిలో అనుభవించడమే అంత:శత్రువులను త్యజించడం. అలా జయించగలిగితే, నాయకుని స్థానం పదిలమవుతుంది.
కామం అంటే తీవ్రమైన కోరిక. అది సంపదపై లేదా అధికారంపై కావచ్చు. దీనివల్ల దానిపై బలమైన అనుబంధాన్ని పెంచుకుంటాం. కాలక్రమేణా దానిని వదలుకోలేని మానసిక బలహీనత ఏర్పడుతుంది. అందుకు ఎంతటి నీచానికైనా పాల్పడ డం జరుగుతుంది. అదే వ్యక్తి పురోగతికి అవరోధమౌతుంది. క్రోధం, కోపం భావోద్వేగానికి సంబం ధించినవి. కోపం మితిమీరితే క్రోధంగా మారుతుంది. వ్యతిరేకమైన ఫలితాన్ని నిర్వహించుకోలేని అసమర్థతను అదుపు చేసుకోలేని బలహీనత క్రోధానికి దారితీస్తుంది. క్రోధం వల్ల ఒత్తిడి పెరిగి, చేసే పనిలో నాణ్యత తగ్గుతుంది. కోపిష్టిగా ముద్ర పడిన నాయకుడిని ఎవరూ ఇష్టపడరు. పరిస్థితులు ఎలా ఉన్నా, పనిలో ఎంతగా ఒత్తిడి పెరిగినా మానసికంగా ప్రశాంతతను సాధించగలిగిన నాయకుని పని విధానం ఉత్తమంగా ఉంటుంది. ఆ నాయకుడే విజయసాధకుడవుతాడు.
లోభం కూడా ఇలాంటిదే. సృష్టిలో ప్రతి జీవి అవసరానికి సరిపోయినంతగా వనరులు ఈ భూమిపై ఉన్నాయి. అయితే, కొందరి అత్యాశ, దురాశవల్ల వనరులు కొందరి చేతులలో బంధీయై అత్యధికులు పీడితులౌతున్నారు. అవసరానికి మించి దాచుకోవాలనే తపన లోభానికి దారి చూపుతుంది. ఉన్నత స్థాయికి చేరే మార్గం చూపే సంతృప్తి, విజయానికి దారి తీస్తుంది. సాధించిన భౌతిక సంపదను సమాజ హితానికి వ్యయించే వ్యక్తి ఉన్నతునిగా చెప్పబడుతాడు. ఇక, మానం. చిత్తౌన్నత్యమే మానం. నేనే అనుకోవడం కన్నా నేనూ అనుకోవడం వల్ల కార్యం సజావుగా జరుగుతుంది. ఏ కార్యావిష్కరణ అయినా వ్యష్టిగా కాదు సమష్టిగానే నెరవేరుతుంది.
నాయకునిగా సహచరులకు ప్రేరణ నివ్వడం, బృందాలను నిర్మించి సమన్వయం చేయడం.. ఫలితాన్ని అందరికీ అందించడం వల్ల వికాసం కలుగుతుంది. దానికి బదులుగా నేనే అనే అహంభావాన్ని ప్రదర్శిస్తే బృందం దూరమయ్యే అవకాశం ఉంటుంది. మదం అంటేనే పొగరుబోతుతనం లేదా అహంకారం. ఎదుటివారిని లక్ష్యపెట్టకపోవడం వల్ల కార్యసాఫల్యత జరగదు. ఎవరు తప్పు చేసారని కాక తప్పు ఎక్కడ జరిగిందో చూసి, సరిచేసే నాయకుడు విజయసాధకుడవుతాడు. సహచరుల తప్పు లెన్నుతూ అడుగడుగున వారిని అవమానిస్తూ తన ఆధిక్యాన్ని ప్రదర్శించే నాయకుడు అపజయం పొందుతాడు. నేనే అనికాక మనం అనుకోవడమే విజయానికి మూలమని గుర్తించాలి.
హర్షం విషయానికి వస్తే, ఇతరులను అవమానించడం ద్వారా ఆనందించడం హర్షంగా చెప్ప బడుతుంది. ఇతరుల అపజయాలను చూసి ఆనందించడం, అమితమైన ఉద్వేగం, ఉత్తేజం హర్షానికి ప్రాతిపదికలు. విజయాన్ని ఆస్వాదించడం, ఆనందించడం సమంజసమే కాని నేనే ఆ విజయాన్ని సాధించాననే ఉద్వేగానికి లోనుకావడం, ఉత్తేజితులై ఎవరినీ లక్ష్యపెట్టక పోవడం అపజయానికి దారి చూపుతుంది. చిత్త సమత్వం మాత్రమే సరైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి విజయంలో సహచరులను భాగస్వాములను చేసిన నాయకుడే విజయసాధకుడవుతాడు. ఈ ఆరు మానసిక అవలక్షణాలు వ్యక్తి పురోగతిలో శత్రువులుగా పరిగణిం పబడతాయి. వినయంతో కూడిన విద్యవల్ల వీటిని జయించడం లేదా త్యజించడం సాధ్యమవుతుంది. అదే వ్యక్తిని ఉన్నత స్థితికి చేరుస్తుంది.
పాలకుర్తి రామమూర్తి