ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలి.. నీటిని వృథా చేయొద్దు
కాల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్, ఆగస్టు 20: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్ పరిధిలోని కాల్వలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బ్పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి సమీపంలోని ప్రధాన కాల్వ నుంచి సాకర్పల్లి, ఏదుట్ల, గోపాలపేట, రేమద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం ప్రాంతాల్లోని కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు.
కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరుపై ఆరా తీశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.
తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా సాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్, కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్రావు, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






