16-10-2025 10:46:42 PM
వ్యక్తిని పట్టుకొని రిమాండ్ కు తరలించిన మేడిపల్లి పోలీసులు
మేడిపల్లి (విజయక్రాంతి): ప్రైవేటు హాస్పిటల్స్, స్కూల్ ల సంబంధించిన అనుమతి పత్రాలు ఎన్ఓసీలు సరిగ్గా లేవనని అపరిచిత వ్యక్తి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఆద్వర్యంలో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి అతనిని అరెస్టు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన వ్యక్తి మహమ్మద్ జుల్కర్ నాయన్(36) తండ్రి మహమ్మద్ ఓజియార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవాణి సింగారం మణిదీప కాలనీలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు జిహెచ్ఎంసి, డిఎంహెచ్ఓ, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వచ్చానని ఆసుపత్రులు, విద్యాసంస్థల అనుమతి పత్రాలు సరిగ్గా లేవని, ఎన్ఓసీలు లేదని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు నిర్దారణ అయిందని, అతనిపై అనేక పోలీస్ స్టేషన్లో వివిధ కేసులు నమోదు అయ్యాయని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.