16-10-2025 10:43:46 PM
డీసీసీ గేట్లకు తాళాలు – వర్గాల మధ్య ఘర్షణ..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ఎన్నికల ప్రక్రియ మరలా ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల అభిప్రాయ సేకరణ కోసం గురువారం ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానె రావడంతో, జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తలెత్తింది. పరిశీలకులు వచ్చిన సమయంలో డీసీసీ కార్యాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు ఒకరినొకరు ఆరోపణలతో నిలదీయడంతో ఉద్రిక్తత చెలరేగింది.
ఈ క్రమంలో డీసీసీ కార్యాలయం రెండు గేట్లకూ తాళాలు వేసి, వెలిచాల రాజేందర్ రావు తో పాటు ఆయన వర్గీయ నేతలను లోపలికి రానివ్వలేదు. రాజేందర్ రావు అనుచరులు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిశీలకులు ఆత్మీయంగా నేతలను చర్చకు పిలవాలని యత్నించినప్పటికీ, రెండు వర్గాల మధ్య మనస్పర్థలు తగ్గకపోవడంతో సమావేశం ప్రారంభం ఆలస్యమైంది.