16-10-2025 10:59:31 PM
చిన్న చింతకుంట: పాలమూరు తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దమగ్నాపూర్ లో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డిలతో పాటు పాలకమండలి సభ్యులు అందించారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేపట్టాలని ఆయన ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులకు సూచించారు. జాతర ఏర్పాట్లపై దేవస్థానం చైర్మన్, ఈవో లను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.