10-02-2025 11:04:12 PM
మహేశ్వరం (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఇన్స్‌స్పెక్టర్ కీసర నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెల్‌గూడ ప్రాంతానికి చెందిన పుస్తకాల శ్యామ్ ప్రసాద్(40), కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఆ మధ్య కాలంలో ర్యాపిడో నడిపించి కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయితే ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో తరచూ భార్య, పిల్లలతో చెప్పుకుంటూ బాధపడే వాడు. పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నానని ఆవేదన చెందేవాడు.
సోమవారం ఇదే విషయం పలుమార్లు భార్య ప్రియాంకతో చెప్పి బాధపడినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య ప్రియాంక వాష్ రూముకి వెళ్లిన సమయంలో శ్యామ్ ప్రసాద్ తన బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యోన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.