20 June, 2026 | 1:31 PM

కరిగిపోయిన రూపాయి

21-06-2024 12:10 AM

రికార్డు కనిష్ఠానికి పతనం

17 పైసలు తగ్గిన కరెన్సీ

ముంబై, జూన్ 20: దేశంలోకి విదేశీ పెట్టుబడులు గత కొద్ది రోజులుగా తరలివస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడిన నేపథ్యంలో రూపాయి రికార్డు కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 24 పైసలు పడిపోయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.68 వద్ద ముగిసింది. చివరకు క్రితం ముగింపు 83.44తో పోలిస్తే 17 పైసలు తగ్గుదలతో 83.61 వద్ద నిలిచింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు ర్యాలీ జరపడంసైతం రూపాయి విలువను దెబ్బతీసినట్టు ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. డాలర్ పటిష్ఠత కారణంగా రూపాయి బలహీనపడిందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. 

83.30 శ్రేణిలో ట్రేడింగ్

వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్ డాలర్/ఇండియన్ రూపీ పెయిర్ 83.30 శ్రేణి మధ్య కదలవచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.15 శాతం బలపడి 105.12 సమీపంలో కదులుతున్నది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల స్థాయిని అధిగమించింది. ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించడం, ఉక్రెయిన్ బలగాలు రష్యా చమురు క్షేత్రాలపై డ్రోన్‌లతో దాడులు జరపడం తదితర సంఘటనలతో యూఎస్ డాలరు బలపడిందని, చమురు ధర పెరిగిందని జెఎం ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ చెప్పారు.