calender_icon.png 12 August, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ఆసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు!

12-08-2025 12:00:00 AM

హాస్పిటల్ స్లాబ్ పైనుంచి రూముల్లోకి వర్షపు నీరు 

విధులకు హాజరుకాని డాక్టర్లు

అలంపూర్, ఆగస్టు 11: గత ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నడిగడ్డ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ. 21 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అలంపూర్ చౌరస్తాలో వందల పడకల ఆసుపత్రిని నిర్మించింది. ఆసుపత్రి నిర్మాణం నుంచి వైద్య సేవల ప్రారంభం వరకు నిర్లక్ష్యమనే జబ్బు వెంటాడుతూ ఉంది.

కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ప్రభుత్వాని కి పలు రకాల విజ్ఞప్తులు చేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత నెల తాత్కాలిక వైద్య సిబ్బందితో ఆసుపత్రి లో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిం ది.

అయితే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆశపడ్డ రోగులకు డాక్టర్లు లేకపోవడం ఒక సమస్యగా మారితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హాస్పిటల్ స్లాబ్ నుంచి వర్షపు నీరు రూముల్లోకి కారుతుండడం మరొక సమస్యగా మారుతుంది.దీంతో వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి బంధువులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

నిర్మాణంలో నిర్లక్ష్యానికి నిదర్శనం 

వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నాసిరకం పనులు చేయడం వల్లే స్లాబు పైనుంచి పిల్లర్ల ద్వారా నీరు కారుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రిలో పిల్లర్ల వెంబడి వర్షపు నీరు కారుతుంది. సిబ్బంది బకెట్లతో వర్షపు నీటిని తోడివేయాల్సిన దు స్థితి ఏర్పడింది.ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు వర్షపు నీటిని తోడివేస్తూ జాగరణ చేసే పరిస్థితి ఏర్పడింది.

విధులకు రావడంలేదని విమర్శలు 

వంద పడకల ఆసుపత్రిలో జనరల్ ఓపీ సేవలు ప్రారంభం అయిన షిఫ్టుల వారిగా డ్యూటీలకు వచ్చే డాక్టర్లు విధులకు సక్రమం గా హాజరు కావడంలేదనే పలు విమర్శలు వస్తున్నాయి.ప్రతి షిఫ్ట్ కు ముగ్గురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఏంలు ఇతర సిబ్బంది విధులు నిర్వహించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ పరిస్థితి నెలకొంది.ఉదయం ఒక డాక్టరు చుట్టపు చూపు మాదిరి అలా వచ్చి వెళ్ళిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన ఆరోగ్య వైద్య చికిత్సలు అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అలాగే ఆసుపత్రిలో సమస్యలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.