calender_icon.png 7 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కొత్త మేడారం!

06-01-2026 12:25:47 AM

18న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తాం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): రూ. 200 కోట్లతో చేపట్టిన మేడారం ఆధునికీకరణ పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయని, ఈనెల 19వ తేదీలోపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను వరంగల్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నానని, అందుకే సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి మేడారం పనులను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నను ఆయన సమాధానమిచ్చారు. కనీసం 200 సంవత్సరాలకు పైగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆధునికీకరణ పనులు చేపట్టామని ఆయన వివరించారు.  మేడారం చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే పనుల కోసం 29 ఎకరాల భూమిని అధికారికంగా సేకరించామని తెలిపారు. భక్తుల కు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో 63 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించామని వెల్లడించారు. ఈ నెల18న సీఎం రేవంత్‌రెడ్డితో సహా శాసనసభ, శాసన మండలి సభ్యులను, మంత్రులు, స్పీకర్‌ను ఆహ్వానిస్తామని వెల్లడించారు. 

సబ్ రిజిస్టరేట్లకు శంకుస్థాపన

ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తామని మంత్రి పొంగులేటి తెలి పారు. ఎమ్మెల్సీ  ఏవీఎన్‌రెడ్డి  అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 94 అద్దె భవనాల్లో, 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. మూడు దశల్లో వీటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో ఔటర్ రింగ్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్కోదానికి మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించామని చెప్పారు. రెండో దశలో జిల్లా కేంద్రాల్లో, మూడోదశలో నియోజకవర్గాలలో భవనాలను నిర్మిస్తామని వివరించారు.