3 July, 2026 | 1:57 AM

భక్తుల సేవకు పెద్దపీట

03-07-2026 01:09 AM

పారదర్శకత, సాంకేతికత వినియోగంపై దృష్టి

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

వేములవాడ రాజన్న ఆలయ ఈఓ రమాదేవి

వేములవాడ, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పరిపాలన, భక్తుల సేవలు, మౌళిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ పలు సంస్కరణలు అమలవుతున్నాయి. ఆలయ కార్యనిర్వ హణాధికారి ఎల్ రమాదేవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ పరిపాలనలో పారదర్శకత పెంపు, సాంకేతికత వినియోగం, ఆర్థిక క్రమశిక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, అనుబంధ ఆలయాల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆలయ భద్రత, పరిపాలనా సామ ర్థ్యాన్ని పెంచేందుకు ఆలయ ప్రాంగణం, కానుకల కౌంటర్లు, క్యూలైన్లు తదితర కీలక ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల హాజరు, విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు ఫేస్, ఐ-స్కానింగ్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేశారు.దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని నివారించేందుకు తేదీ, సమయంతో కూడిన డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

టికెట్ల పునర్విక్రయానికి అవకాశం లేకుండా సాంకేతిక చర్యలు చేపట్టారు. అలాగే భక్తులు దర్శనాలు, సేవలు, వసతి, ఇతర ఆలయ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు వాట్సప్ క్యూ ఆర్ కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పెంపునకు చర్యలు చేపడుతూ హుండీ నిర్వహణను క్రమబద్ధీకరించారు. టెండర్ల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. దేవస్థానం ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు వ్యయ నియంత్రణపై కూడా దృష్టి సారిస్తున్నారు.

భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించేందుకు క్యూలైన్ వ్యవస్థను మెరుగుపరిచారు. తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కేంద్రాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లను విస్తరించారు. ప్రసాదాల తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారీ ఉత్సవాల సందర్భంగా అదనపు ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, వీల్చైర్లను అందుబాటులో ఉంచారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ ఆలయం సహా అనుబంధ దేవాలయాల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి.

మాస్టర్ ప్లాన్లో భాగంగా మౌళిక వసతులను మెరుగుపరుస్తున్నారు. భీమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడంతో పాటు స్వామివారి ప్రచార రథాన్ని తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు.రాజన్న ఆలయ విస్తీర్ణం,అభివృద్ధి, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులను భాగస్వాములను చేసే ఉద్దేశంతో పారదర్శక విరాళాల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరాళాల వినియోగంలో పారదర్శక విధానాలను అనుసరిస్తున్నారు.

దేవస్థానం గోశాలలో గోమాతల సంరక్షణకు ఆధునిక సౌకర్యాలు కల్పించారు. వేసవి కాలంలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు కూలర్లు, ఫాగర్లు ఏర్పాటు చేశారు. రైతుల సహకారంతో వరిగడ్డి సేకరించి మేత కొరత లేకుండా చర్యలు చేపట్టారు. సిబ్బంది సంక్షేమంపై కూడా దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు నాలుగు రోజుల సెలవులు మంజూరు చేస్తున్నారు.

వారి వేతనాలను ముందుగా విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రైనేజీల శుభ్రత, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై చర్యలు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఈఓ రమాదేవి మాట్లాడుతూ, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, భక్తుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ దేవస్థాన సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.