బడిలోనే పంతులు కునుకు!
- తల్లిదండ్రుల ఆగ్రహం
- మెమో జారీ చేస్తామన్న ఎంఈఓ
పెద్దమందడి (వనపర్తి), జూలై 2 (విజయక్రాంతి): గిరిజన తండాల్లోని ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యా ప్రమాణాలు పడకేస్తున్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణితో లక్ష్యాలకు గండి పడుతోంది. వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలోని బుగ్గవల్లి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు జె.బాలరాజు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే గ్రామస్తులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
సమయపాలన పాటించకపోవడం, సక్రమంగా విద్యా బోధన చేయడం లేదని వాపోతున్నారు. గు రువారం పాఠశాలను సందర్శించగా ఉద యం 11.40 గంటల సమయంలో ఉపాధ్యాయుడు బాలరాజు కుర్చీలో కునుకు తీస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. పదినిమిషాలపాటు చిత్రీకరణ జరిగినా ఆయన మాత్రం మేలుకోకపోవడం గమనార్హం.
2002లో ఉద్యోగంలో చేరిన బాలరాజు డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చారు. విద్యనందించి పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన వారే తరగతి గదిలో నిద్రపోతే ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు.ఈ అంశంపై మండల విద్యాధికారిని (ఎంఈవో) మంజులతను సంప్ర దించగా ఆయనకు మెమో జారీ చేస్తామని చెప్పారు. కాగా ఉపాధ్యాయుడు బాలరాజు తీవ్ర అలసట వల్ల కాసేపు నిద్రపోయానని చెప్పడం కొసమెరుపు.






