calender_icon.png 12 January, 2026 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బాపు’కి కవితాంజలి

12-01-2026 02:59:34 AM

‘బాపు’ దీర్ఘ కవిత ఒక స్మృతి కవిత. ఇన్నాళ్లు తోడుగా నిలిచిన నాన్న. ఎవరు నాన్నను కోల్పోయినా.. వారిని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. నాన్నతో పంచుకున్న జ్ఞాపకాలు నెమరుకువస్తూనే ఉంటాయి. ఆ వ్యథ చెప్పనలవి కాదు. పదిమందికి సంతోషాన్ని చెప్పుకొన్నట్లుగా దుఃఖాల్నికూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకొని తనను తాను ఓదార్చుకున్న కవితే ‘బాపు’ అనే దీర్ఘ కవిత. ఇట్యాల వెంకట కిషన్ వృత్తి రీత్యా రెవెన్యూ అధికారి అయినప్పటికీ సాహిత్యంపై ఆయనకు మమకారం. స్వయంగా కవి కూడా. తన తండ్రి గతేడాది జనవరి ౫న కాలం చేయగా, ఆయన స్మృతిలో వెంకట కిషన్ ఒక దీర్ఘ కవిత రాశారు. నాన్న జీవితంలోని మధురిమలను, కడగండ్లను చాలా దగ్గరగా చూస్తూ కవిత్వ రూపంలో చెప్పిన కవి ఆయన. నాయిన ఎరుకలను తన కవిత్వంలో వలపోశాడు. ప్రేమను గుండెనిండా పొందాడు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా తన తండ్రి కొనసాగించిన పోరాటాన్ని అక్షరబద్ధం చేశారు.

తండ్రి స్నేహితులైన శెట్టి వెంకటయ్య, గాండ్ల మల్లయ్య జీవితాలను ఆవిష్కరించారు. కవిత్వంలోని వర్ణన నాగేటి కర్రులై నడిచాయి. చూపు ఉన్న పాటలా గురితప్పని బాణంలా వాక్యాలు హృదయాలను కలచివేస్తాయి. ప్రతి పాదం చివరి వాక్యం మనసును ఉప్పొంగిస్తాయి. తండ్రి ఆహర్యం పేదరికం, జీవన విధానాన్ని వర్ణిస్తూనే ‘నా తండ్రి ఒక రైతు’ అని గర్వంగా చెప్పిన వ్యక్తీకరణ అద్భుతంగా ఉంది. ‘అమ్మ కన్నీళ్లు కనిపించినట్లుగా  నాన్న కళ్లలో కన్నీరు కనిపించదు’ అని కవి అన్నారంటే దాని లోతును అర్థం చేసుకోవచ్చు. కొడుకు ఎదిగేందుకు తండ్రి పడిన తండ్లాటను కళ్లకు కట్టారు. తన తండ్రి కష్టానికి వెనుదిరుగని ధీరుడని, మాటకైనా పాటకైనా ఆపదకైనా ముందుండే మనీషి అని, కిందివర్గాల వారు ఎదుగాలని కోరుకున్నాడని, ఆత్మగౌరవమై నిలబడ్డాడని కవిత్వం ద్వారా గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘అరేయ్ తొరేయి’ పిలుపులేందిరా.. అంటూ దొరకొడుకును నిలదీసిన తీరును, బారు చక్రవడ్డీల వ్యాపారులకు వ్యతిరేకంగా నిలబడిన తెగువను అక్షర బద్ధం చేశాడు.. ‘చెమట చుక్కలతో నేలను సారవంతం చేశాడు. పిడికిలి బిగపట్టి దేశానికి నాగరికత నేర్పాడు. వాస్తవంలో బతికే బుద్ధుడు. మొదటి కామ్రేడ్. సామ్యవాది.

రైతులకు ఆదర్శంగా నిలిచిన బాపు’ అంటూ వర్ణించారు. ‘నన్నెవరైనా మీ తండ్రెవరయ్యా అని అడిగితే/ నెత్తికి తువ్వాల పెయిమీద పొక్కలు వడ్డ బురద చుక్కల బనీను/ నడుముకు దగ్గరగా గుంజి కట్టిన ధోతి/ జబ్బ మీద నాగలి /గర్వంగా చెప్తాను నా తండ్రి ఒక రైతని’ కవి గర్వంగా చాటుకున్నారు. ‘తనతో పాటు కింది వర్గాలు ఎదగాలని/కోరుకునే /సాహు మహరాజ్ వారసుడు’ అని కొనియాడారు. ‘మా తప్పు తెల్సుకునేలా చేసిన గొప్ప/అహింసా సాధకుడివి బాపు నువ్వు మాకు’ అంటూ తండ్రిని ఆకాశాన నిలబెట్టారు. ‘సకల కుల వృత్తిదారులకు, కలివిడిగా ఉండెటోళ్లకు కల్లంకాడికొచ్చిన యాచకులకు లేదనకుండా కల్లంలోని గింజల్ని కుంచాల లెక్కన పంచే సహృదయుడు మా బాపు వెంకటయ్య’ అంటూ ఎవరికష్టం వారికి చెందాలని నమ్మి ఆచరించిన కమ్యూనిస్టు, ఆచరణ శీలి అంటూ రాశారు. ‘కొడవండ్లు గొడ్డళ్లు సరిపిచ్చిన కమ్మరి కుమారస్వామి, వడ్లబ్రహ్మయ్య తాత,కుమ్మరి రాయమల్లు, సాకలి కనకవ్వ..’ ఇలా సబ్బండ వర్గాలతో నాన్న నడుచుకున్న ప్రేమను ఏకరువు పెట్టారు. తల్లితండ్రుల తాలూకు జ్ఞాపకాలు, వారి వేళ్లు పట్టి పొలం వైపు వేసిన అడుగులను మరచిపోని నాస్టాల్జిక్ కవి వెంకట కిషన్. వేలు పట్టి నడిచిన అడుగులను, బిడ్డల అవసరాలను పసిగట్టి సూక్ష్మదర్శిని అయిన నాన్న నాడి పట్టుకున్నాడు. నాన్న గురించి వచ్చిన దీర్ఘ కవితల్లో ఈ కవిత గొప్ప కవితగా నిలిచిపోతుంది. 

వనపట్ల సుబ్బయ్య

94927 65358