12-01-2026 02:58:23 AM
“దేశం
తల అవతల పెడదామంటే
ఒకటే యుద్ధాల గోల
పోనీ
లోపలికని ముడుచుకుందామంటే
రోత రాజకీయాల రొద
***
కాసేపు
నిలబడన్నా ఉందామంటే
ఠక్కున నెత్తికి తాకి బొప్పి కట్టించే
నిత్యావసర వస్తువు ధర”
&అంటూ.. తెలుగు సాహిత్య యవనికపై ఒక నిప్పుకణంలా మండుతూ, బతికనంత కాలం ప్రజల వెతలు, వ్యథలను అక్షర బద్ధం చేస్తూ, వ్యక్తిగత జీవితానందాలను సైతం త్యాగం చేసి, ప్రతి క్షణక్షణం సమ సమాజం కోసం జ్వలించిన నిఖార్సైన కవి అలిశెట్టి ప్రభాకర్. ఆయన కవిత్వం ఒక ఎడారిలోని ఒయాసిస్ కాదు.. ఎండమావీ కాదు.. అది పదునైన కత్తి అంచు. గాయపడిన గుండె చప్పుడు. ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించిన గొంతుక. క్షయ బారిన పడి రోజుకు కొంత కరిగిపోతున్నా.. సమాజంలోని కుళ్లును కడిగేందుకు ఆయన అక్షరాలనే మందుబిల్లలుగా వాడాడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్నీ ఆయన ఒకే విధంగా ప్రేమించాడు. తన కవితలకు తానే రేఖచిత్రాలు గీసేవాడంటే ఆయన ప్రతిభ ఎంతటితో అంచనా వేయవచ్చు. మహాకవి శ్రీశ్రీ తర్వాత అంతగా జనం నరాల్లోకి ఎక్కిన కవిత్వం, కోట్ చేయదగిన కవిత్వం అలిశెట్టిదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలిశెట్టి ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1954 జనవరి 12న జన్మించాడు. తల్లిదండ్రులు అలిశెట్టి చినరాజాం, లక్ష్మి. అలిశెట్టి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. 11 ఏళ్ల వయస్సులోనే ఆయన చిత్రకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తొలినాళ్లలో పండుగలు, ప్రకృతి దృశ్యాలు, సినీ నటుల బొమ్మలు గీసిన ఆయన ఆసక్తులు తర్వాత జగిత్యాలలోని ‘సాహితీ మిత్ర దీప్తి’ పరిచయంతో కవిత్వం వైపు మళ్లాయి. 1974లో ‘పరిష్కారం’ అనే కవితతో మొదలైన ఆ అక్షర ప్రయాణం, తెలుగు సాహిత్యంలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. బతుకుదెరువు కోసం కొన్నాళ్లు జగిత్యాలలో ‘పూర్ణిమ’, కొన్నాళ్లు కరీంనగర్‌లో ‘శిల్పి’ పేరుతో ఫొటో స్టూడియోలు నడిపాడు. తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. ‘చిత్రలేఖ’ పేరుతో స్టూడియో పెట్టి ఫొటోగ్రాఫర్‌గా రాణించాడు. ఫొటోగ్రఫీ ఆయనకు ఇష్టమైనప్పటికీ, ఆయన ఆత్మ మాత్రం నిరంతరం కవిత్వ పిపాసతోనే రగిలిపోయేది.
సంక్షిప్తత.. గాఢత.. కవి విలక్షణత..
అలిశెట్టి కవిత్వంలో ప్రధానంగా కనిపించేది సంక్షిప్తత, గాఢత. చాలా తక్కువ పదాలతో సమాజంలోని లోతైన వైరుధ్యాలను మన కళ్లకు కట్టినట్లు చూపే ప్రతిభ ఆయనది. అలిశెట్టి కేవలం కవి మాత్రమే కాదు.. ఒక దార్శనిక చిత్రకారుడు కూడా. అందుకే ఆయన కవితలు విజువల్ నెరేటివ్‌లా మన కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. ‘పాలరాతి బొమ్మునా.. పార్లమెంట్ భవనమైనా.. వాడు చుడితేనే శ్రీకారం.. - వాడు కడితేనే ఆకారం’ అంటూ శ్రామైక జీవన సౌందర్యాన్ని అంత సూటిగా వర్ణించిన కవుల్లో ఆయనే మేటి. సామాన్యుడి కష్టాన్ని పారితోషికంతో కాకుండా, సమాజం ఇచ్చే గౌరవంతో కొలిచే మనస్తత్వం ఆయనది. శ్రమను గౌరవించని సమాజాన్ని ఆయన తన అక్షరాలతో ఎండగట్టాడు. ఆయన ‘ఎర్ర పావురాలు’, ‘మంటల జెండాలు’, ‘చురకలు’, ‘రక్తరేఖ’ వంటి సంకలనాలు తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు.
నిరంతరం సంఘర్షణ
అలిశెట్టి జీవితం ఒక నిరంతర సంఘర్షణ సాగింది. హైదరాబాద్ నగరానికి కుటుంబంతో వచ్చిన తర్వాత ఆయన రాసిన ‘సిటీ లైఫ్’ మినీ కవితలు నాడు ప్రభంజనం సృష్టించాయి. ఆరేళ్ల పాటు ఆయన రాసిన ఓ ప్రధాన పత్రికలో 1,425 కవితలు వెలువడ్డాయి. నగరమంటే కేవలం వెలుగుల జిలుగులు కాదని, పై పై మెరుపులేనని, అక్కడ మనుషుల మధ్య ఉండే ఒంటరితనాన్ని, ఇళ్ల యజమానులు అద్దెకుండే వారిపై ప్రదర్శించే కర్కశత్వాన్ని తన కవితల్లో ఎండగట్టాడు. పేదల కటిక దారిద్య్రాన్ని ఆయన హృదయం దవ్రించేలా విశ్లేషించాడు. ‘హైదరాబాద్ అనే మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి’ అంటూ ఆయన ఓ కవితలో అన్నాడంటే ఆయన జీవితానుభవాలు ఎంత లోతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆయనది ఎంతటి దయనీయ స్థితి అంటే, తన కవితలు అచ్చయిన పత్రికను కొనుక్కునేందుకు కూడా జేబులో పైసలు ఉండేవి కాదు. అయినప్పటికీ, తన కవిత్వాన్ని ఆయన వ్యాపారం చేయలేదు. తన కలాన్ని ఎవరికీ తాకట్టు పెట్టలేదు.
క్షయ వ్యాధిని లెక్య చేయకుండా..
అలిశెట్టి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఆయన్ను క్షయ వ్యాధి ఆవహించింది. వ్యాధి శరీరాన్ని లోపల అవయవాలను తొలిచేస్తున్నా, ఆయన కవితావేశం మాత్రం తగ్గలేదు. ఆసుపత్రి బెడ్‌పై ఉండి కూడా ఆయన సమాజం గురించి ఆలోచించిన ధన్యజీవి. ‘బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి, సంవత్సరాల మేకులు దిగేసి వదిలేస్తే.. ఇంకెందరు నిరుద్యోగ క్రీస్తులో’ అంటూ నాటి విద్యా వ్యవస్థలోని లోపాలను ‘రక్తరేఖ’ సంకలనంలో ప్రశ్నించాడు. వేశ్యల జీవితాల మీద ఆయన రాసిన ‘తనువు పుండై.. తాను పండై..’ అనే కవిత చదివి కన్నీరు పెట్టని పాఠకుడు ఉండడు. ఆయన దృష్టిలో కవిత్వం అంటే కేవలం అలంకారం కాదు. అది ఒక సామాజిక బాధ్యత. అందుకే ఆయన మరణానికి ముందే ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించుకున్నాడు. 1993 జనవరి 12న సరిగ్గా తన పుట్టినరోజే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. ఎక్కడ, ఎవరు పేదరికాన్ని వెక్కిరించినా అలిశెట్టి కవిత్వం ఒక అలారమై నిద్రలేపుతూనే ఉంటుంది.
రతన్ రుద్ర