06-11-2025 04:44:23 PM
సుల్తానాబాద్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): 15 రోజులలో మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ పట్టణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి నిర్మాణంలో ఉన్న మానసిక దివ్యాంగుల పాఠశాల, వృద్దాశ్రమం పనులను, కేంద్రీయ డ్రగ్ స్టోర్ (కేంద్రీయ మందుల గిడ్డంగి కేంద్రం)లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ సుల్తానాబాద్ లో నిర్మాణమవుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి 15 రోజులలో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
వృద్దాశ్రమ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. దివ్యాంగుల పాఠశాలలో అడ్మిషన్ కోసం 40 మంది పిల్లలు వచ్చిన నేపథ్యంలో తల్లితండ్రులతో సంప్రదిస్తూ రెగ్యులర్గా పిల్లలు పాఠశాలలకు వచ్చేలా చూడాలని, పిల్లలకు అవసరమైన బోధన సామాగ్రి, ఆట వస్తువులు సిద్దం చేయాలని అన్నారు. అనంతరం కేంద్రీయ డ్రగ్ స్టోర్(కేంద్రీయ మందుల గిడ్డంగి) లను ఆకస్మికంగా పరిశీలించి వైద్య కళాశాల రామగుండంకు మందుల సరఫరా రెగ్యులర్ గా ఉండాలని తెలిపారు. డ్రగ్ స్టోర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, స్టోర్ ఫార్మసి సిబ్బంది శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.