calender_icon.png 28 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అక్షర కోట’లో సేదతీరిన రాకుమారి

19-01-2026 12:00:00 AM

కేవలం సాహిత్య పిపాసిగానే కాకుండా రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్‌గిర్ జీవితం కవిత్వం, సంస్కృతి, రాచరిక వైభవాల అపురూప సంగమం. హైద రాబాద్ నిజాం కొలువులో ప్రముఖులైన రాజా ధనరాజ్‌గిర్ కుమార్తెగా జన్మించిన ఆమె.. కేవలం సంపన్నుల వారసురాలిగానే కాకుండా, తనకంటూ సాహిత్యపరమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 9 ఏళ్ల ప్రాయంలోనే ఆమె తొలి కవిత రాశారు.

తర్వాత జీవితమంతా సాహిత్యంతోనే మమేకమయ్యారు. అలనాటి ఉర్దూ కవులు అల్లామా ఇక్బాల్, మఖ్దూం మొహియుద్దీన్ వంటి మహామహుల నిర్దేశకత్వంలో ఆమె సాహిత్యంవైపు మళ్లారు. ఆంగ్లంలో కవిత్వం ఆమె రాశారు.మఖ్దూం మొ హియుద్దీన్ ఆ కవితలను ఉర్దూలోకి అనువదించేవారు. ఆమె ఒకప్పుడు మహారాష్ట్రను పాలించిన పేష్వాల వంశానికి చెందినవారు. ఆమె తండ్రి రాజా ధన్‌రాజ్ గిరి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

ఆమె బాల్యం ముంబైలో మొదలైనప్పటికీ, హైదరాబాద్‌లోని జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ ఆమె కేరాఫ్. ఆ రోజుల్లోనే వారి ఇంటి వెనుక పులులు, చిరుతలతో కూడిన సొంత జూ ఉండేదంటే వారి వైభవం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజకుటుంబంలో పుట్టినప్పటికీ, నెలకు పది రూపాయల పాకెట్ మనీతో సామాన్యంగా బతకడం నేర్చుకున్న విలక్షణ వ్యక్తిత్వం ఆమెది. 1973లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. వరల్డ్ పోయెట్రీ సొసైటీ ఇంటర్‌కాంటినెంటల్ అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్ ఆమె పేరును ప్రతిపాదించారు.

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. ‘రిటర్న్ ఎటర్నిటీ’, ‘ది అపోస్టల్’ వంటి ఆమె రచనలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. ‘అరబిందో స్కూల్ ఆఫ్ పొయెట్రీ’ అనే నాటి శైలి కవయిత్రిగా ఆమెకు గుర్తింపు ఉంది. ‘మెమోరీస్ ఆఫ్ ది డెక్కన్’ అనే పుస్త కం ఆమె రచనల్లో మేటి. ఈ పుస్తకం హైదరాబాద్ గత వైభవాన్ని, రాజకుటుంబాల వైభవాన్ని చిత్రించే అపురూపమైన కాఫీ టేబుల్ బుక్.

ఆమె ఒక ఉర్దూ పత్రికలో ఆమె 12 ఏళ్ల పాటు వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల సంకలనంతో తర్వాత 750 పేజీల భారీ గ్రంథంగా వెలువడింది. ఆమె కవిత్వంలో తాత్వికత, డెక్కన్ ప్రాంతపు సంసృ్కతి మిళితమై ఉంటుంది. కవితల్లో గాఢమైన అనుభూతి దాగి ఉంటుంది. ఆమె సాహితీవేత్తగానే కాకుండా చిత్రకారిణిగాను ప్రసిద్ధి. ముంబైలో ఆమె ఒకమారు ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్‌తో కలిసి తాను కూడా చిత్రకళా ప్రదర్శన నిర్వహించడం విశేషం.

శేషేంద్ర కవిత్వానికి మొదటి విమర్శకురాలు

ఇందిరా దేవి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రఖ్యా త తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మతో ఆమె పరిచయం. ఆ పరిచయం వివాహంగా పరిణామం. ఒక రాజకుమారి అచెంచలమైన కవితా జిజ్ఞాసతో ఒక కవిని వరించడం సా హితీ జగత్తులో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. తాను మెచ్చి న కవి కోసం ఆమె తన రాజభోగాలను పక్కన పెట్టి, ఎవరికీ చెప్పకుండా హలిబీడ్‌కు వెళ్లిపోయారు.

అక్కడ ఒక పురాతన ఆలయంలో కేవలం 14 వేల రూపాయల సొమ్ముతో, అతి సాధారణ వివాహం చేసుకున్నారు. లాంతర్ల వెలుగులో వేలా ది మంది గ్రామస్థులు మధ్య వారి వివాహం జరిగింది. ఆ నిరాడంబరమైన వివాహం ఆమె జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. రాజకుమారిగా ఉండిపోవడం కంటే, ఒక కవికి తోడుగా ఉండటంలోనే ఆమె అసలైన తృప్తిని వెతుక్కున్నారు. వివాహం తర్వాత ‘ఒక ఇంట్లో ఇద్దరు కవులు ఉండకూడదు’ అనే ఉదాత్తమైన భావంతో ఆమె తన కవన ప్రస్థానానికి స్వస్తి పలికారు.

తర్వాత తన భర్త శేషేంద్రశర్మ సాహిత్య ప్రస్థానానికి వెన్నుదన్నుగా నిలిచారు. శేషేంద్రశర్మ కవిత్వానికి ఆమె మొదటి విమ ర్శకురాలు, ప్రోత్సాహకురాలు ఆమే. శేషేంద్రశర్మ రాసిన ప్రసిద్ధ కావ్యం ‘నా దేశం.. నా ప్రజలు’ వెనుక ఆమె ప్రోత్సా హం ఎంతో ఉంది. ఆమె ఇంగ్లిషులో కవితలు రాసేవారు. ఆయన రాసిన అమూల్యమైన గ్రంథాలను ముద్రించడంలో, ఆయన పేరును ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కృషి వెలకట్టలేనిది.

భర్త పేరిట ప్రత్యేక గ్యాలరీ

ఇందిరాదేవి హైదరాబాద్‌లోని నా చారంలో తన భర్త శేషేంద్రశర్మ గౌరవా ర్థం ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పా టు చేశారు. ఈ గ్యాలరీలో శేషేంద్రశర్మ పలువురు ప్రసిద్ధ వ్యక్తులు, సాహితీవేత్తలు, సాధారణ పాఠకులు, తన అభిమానులకు రాసిన సుమారు 10,000 ఉత్తరాలను భద్రపరిచారు. వీటిలో 4 వేలకు పైగా కేవలం పోస్ట్‌కార్డులే కావడం విశేషం. శేషేంద్రశర్మ నాడు ఒక సామాన్య రిక్షా కార్మికుడి నుం చి స్టేషన్ మా స్టర్ వరకు, తన పాఠకు లు రాసిన ప్రతి ఉత్తరానికీ బదులిచ్చేవారు. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ పోగుపరచి ఆమె పదిలపరిచారు. ‘నేను కట్టిన అక్షరాల కోటను నేనే కూలగొట్టలేను’ అని భావించిన ఇందిరా దేవి, శేషేంద్రశర్మ అముద్రిత రచనలు, డైరీలతోపాటు ఆయన ఉపయోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

సాహిత్య వారధి ప్యాలెస్..

చరిత్రలో నిలిచిపోయిన ఎందరో దిగ్గజాలను ఇందిరాదేవి అతి దగ్గరగా చూశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌కు వచ్చి తన తండ్రి నుంచి విరాళం తీసుకున్న సందర్భాన్ని ఆమె ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అలాగే నిజాం ప్రభువు, సాలార్‌జంగ్, మౌంట్ బాటెన్ వంటి రాజకీయ ప్రముఖులతో పాటు దిగ్గజ కవులు విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, సీ నారాయణరెడ్డితో విడదీయలేని సాహితీ అనుబంధం ఉంది.

మహాకవి శ్రీశ్రీ ఓ కేసులో అరెస్ట్ అయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావుతో ఆమె స్వయంగా మాట్లాడి  విడిపిం చారంటే కవుల పట్ల ఆమెకున్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ చరిత్రలో జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్యాలెస్ గోడల మధ్య దాగిన ఎ న్నో చారిత్రక ఘట్టాలకు, సాహిత్య చర్చలకు సజీవ సాక్ష్యం రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిరి. 90 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని జ్ఞాపకశక్తితో, రాజసంతో ప్యాలెస్‌కు వచ్చి న వారికి గత కాలపు విశేషాలను పంచుకునేవారు. అలా ప్యాలెస్ దశాబ్దాల పాటు కవులకు, కళాకారులకు కాణాచిగా మారింది.

ఇందిరాదేవి కేవలం కవయిత్రి మాత్రమే కాదు, చిత్రకారిణిగా, ఫొటోగ్రఫీలోనూ బహుముఖ ప్రజ్ఞను చాటారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హిందీ అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. హిందీ భాషా వికాసానికి తోడ్పడ్డారు. డెక్కన్ సంసృ్కతిని, హైదరాబాద్ జ్ఞాపకాలను ‘మెమోరీస్ ఆఫ్ ది డెక్కన్’ వంటి పుస్తకాలను వెలువరించారు. నిరాడంబరతను ఇష్టపడే ఆమె, తన చివరి శ్వాస వరకు సాహిత్య జ్ఞాపకాల నీడలోనే గడిపారు.

జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌ను నాటి కవులు, రచయితలు ఒక విడిదిగా భావించేవారు. కొన్నాళ్లు అక్కడే సేద తీరుతూ, రచనా వ్యాసాంగాన్ని ప్రశాంతంగా కొనసాగించేవారు. జనవరి 13న ఆమె దివికేగారు. శేషేంద్ర శర్మ సమాధి పక్కనే తన అంత్యక్రియలు జరగాలనేది ఆమె ఆఖరి కోరిక. ఆమె అభీష్టం మేరకు కుటుంబ సభ్యులు ఆ చివరి కోరికనుకోరికను నెరవేర్చారు.