07-09-2025 12:18:00 AM
-వినాయకుడు దయతలచాడు
-బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న లింగాల దశరథ్‌గౌడ్
ఎల్బీనగర్: తన కల నెరవేరిందని, వినాయకుడు దయతలచాడని, ఆరేండ్లుగా ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ ఇప్పుడు తన ఇంటికి వచ్చిందని లింగాల దశరథ్‌గౌడ్ అన్నారు. మీర్‌పేట మున్సిపాలిటీలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటున్న లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.35 లక్షలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు. చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి ఆశీస్సులతో లడ్డూను కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయక్రాంతితో మాట్లాడారు.
విజయక్రాంతి: బాలాపూర్ గణేష్ అంటే అంత నమ్మకమా?
దశరథ: అవును. నాకు బాలాపూర్ గణేష్ అంటే ఎంతో భక్తి. బాలాపూర్ లడ్డూ కోసం ఆరేండ్లుగా ఎదురు చూస్తు న్న. ఇప్పుడు వినాయకుడు కరుణించాడు. మా కుటుంబ సభ్యులు కూడా బాలాపూర్ గణేష్ లడ్డూ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు లడ్డూను కైవసం చేసుకోవడంతో మా ఇంట్లో సంతోషానికి అంతులేకుండా పోయింది.
విజయక్రాంతి: ఈసారి లడ్డూ దక్కుతుందని నమ్మకం ఉందా?
దశరథ: ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ తనకు దక్కింతుందని, విశ్వాసంతో ఉన్నాను. ప్రతిసారి వేలంపాటలో పాల్గొంటున్నా నిరాశే మిగిలింది. 2019 నుంచి బాలాపూర్ వస్తున్నప్పటికీ ఆరేం డ్ల తర్వాత ఈ ఏడాది లడ్డూ దక్కింది.
విజయక్రాంతి: మీ సంతోషాన్ని ఎలా పంచుకుంటారు?
దశరథ: నా సంతోషాన్ని, ఆనందాన్ని నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులతో పంచుకుంటాను. నిరాశే మిగిలినప్పుడు నాకు వారే అండ గా ఉన్నారు. వారి ప్రోత్సాహంతో ప్రతిసారి వేలంపాటలో పాల్గొంటున్నా. ఇప్పుడు పాట గెలిచి, లడ్డూను కైవసం చేసుకున్న.
విజయక్రాంతి: బాలాపూర్ లడ్డూను ఎవరెవరికి ఇస్తారు?
దశరథ: బాలాపూర్ లడ్డూ ప్రతి ఒక్కరికీ పవిత్రమైనది. ముందుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు ఇస్తాను. పవిత్రమైన బాలాపూర్ లడ్డూ ను కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులకు అందజేస్తాను.