14-07-2025 05:04:54 PM
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి మార్కెట్(Nampally Market) ప్రాంతానికి సమీపంలోని ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో సోమవారం మానవ అస్థిపంజర అవశేషాలు ఉండటం కలకలం రేపింది. ఏడు సంవత్సరాలకు పైగా తాళం వేసి ఉన్న ఇంట్లో ఆ అవశేషాలు కనిపించాయి. ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు గ్రహించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని బలవంతంగా తలుపు తెరిచి చూడగా లోపల అస్థిపంజర అవశేషాలు కనిపించాయి. సౌత్ జోన్ డీసీపీ చంద్రమోహన్(South Zone DCP Chandramohan) సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్లూస్ బృందం అక్కడికి చేరుకుని నమూనాలను సేకరించింది. ఇది పురుషుడిదా లేక స్త్రీదా అనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. హబీబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష, సంరక్షణ కోసం అస్థిపంజర అవశేషాలను ఆసుపత్రికి పంపుతారా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఇదీలా ఉండగా, ఓ యువకుడు శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటిలోకి ప్రవేశించినట్లు సమాచారం అందింది. లోపల ఉన్న అస్థిపంజరాన్ని వీడియోలో రికార్డు చేసినట్లు.. అది కాస్త వైరల్ కావడంతో ఆ యువకుడిని పోలీసులు విచారించారు. క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లానని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.