14-07-2025 08:40:49 PM
మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు అలవికాని విధమైన 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోతు శంకర్ నాయక్(former MLA Banoth Shankar Naik) ఆరోపించారు. స్థానిక ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో సోమవారం ఆ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే మహబూబాబాద్, కేసముద్రం అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయలను తాను మంజూరు చేయించానని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు.
పార్టీ క్యాడర్ సంఘటితంగా ముందుకు సాగి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, ఊకంటి యాకూబ్ రెడ్డి, నీలం దుర్గేష్, నజీర్ అహ్మద్, కమటం శ్రీనివాస్, మోడం రవీందర్ గౌడ్, గుంజపొడుగు కొమ్మన్న , గుగులోతు వీరు నాయక్, జాటోత్ హరీష్ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.