calender_icon.png 15 July, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, సకల సౌకర్యాలు..

14-07-2025 08:43:22 PM

సైకిళ్ళ ప్రదాత పూర్వ విద్యార్థికి ప్రశంసలు..

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. సోమవారం బెల్లంపల్లి మండలం జనకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి సంతోష్ రావు పాఠశాలకు అందించిన 72 సైకిళ్ళను జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్యతో కలిసి ఆయన విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలకు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సహకరించాలనే మంచి ఉద్దేశ్యంతో సంతోష్ రావు పాఠశాలలోని విద్యార్థులకు 72 సైకిళ్ళను అందించడం అభినందనీయమని అన్నారు. పాఠశాలకు దూరంగా ఉన్న42 మంది విద్యార్థుల్లో 30 మందికి సైకిళ్ళను అందించడం జరిగిందని తెలిపారు.

సైకిళ్ళ పంపిణీతో తరగతిలో విద్యార్థుల హాజరు శాతం మరింతగా పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు విద్యాబోధన, సదుపాయాల కల్పనపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్షించడం జరుగుతుందని, మండల విద్యాధికారి తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 3వ తరగతి విద్యార్థుల పఠనా సామర్థ్యాలపై జరిపిన సర్వేలో గతంలో 45 శాతం ఉంటే ప్రస్తుతం 75 శాతానికి చేరిందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రహారీగోడల నిర్మాణం, మెనూ అమలు, ఆటస్థలం, మూత్రశాలలతో పాటు లేని వాటిని సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేయాలనన్నారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలను పెంపొందించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా విద్యను బోధించడంజరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలకు ప్రభుత్వ సెలవు దినాలలో కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులకు హాజరయ్యారని తెలిపారు.

ఇదే క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భూములు, ఆస్తులు, వ్యాపారాలు తాతల నుండి వచ్చినా, రాకపోయినా మనం నేర్చుకునే విద్యతోనే భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆద్శర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు గదులు ఇతర అన్ని సదుపాయాలు కల్పించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తమ ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, చదువుపై ఆసక్తి పెంచుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.