14-07-2025 08:30:00 PM
తొలి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేసిన డాక్టర్లను అభినందించిన ఐటీడీఏ పీవో రాహుల్..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో లాప్రోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ మహిళకి లాప్రోస్కోపిక్ సర్జరీ తొలిసారి నిర్వహించిన లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకట్ తో కూడిన వైద్యులు, సిబ్బంది సర్జరీ విజయవంతంగా నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లను ఆయన శాలువాలతో సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన పేరు మాల్ల రమణకు పిత్తాశయంలో రాళ్లు ఉండడంతో రూ.2 లక్షల ఖర్చయ్యే శస్త్ర చికిత్సను చేయించుకునే స్తోమత లేకపోవడంతో వారు ఏరియా వైద్యశాల పర్యవేక్షకుడు రామకృష్ణను సంప్రదించారు అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తొలి లాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించగా అది విజయవంతమైనట్లు తెలిపారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసించే అమాయక గిరిజనులు సరియైన అవగాహన లేక ఇటువంటి భయంకరమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారని, అందుకు వైద్య సిబ్బంది అటువంటి వారిని గుర్తించి తప్పని సరిగా వైద్య సేవలు అందించాలని అన్నారు.
ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలు తుంటాయని అందుకు ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డ్యూటీ డాక్టర్లు 24 గంటలు ఆస్పత్రిలో ఉండే రోగులకు వైద్య సేవలు అందించాలని, గోదావరి వరదలు కూడా పెరగవచ్చని ముంపు ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు చేసే ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకటరాజ్, డాక్టర్ నికిత తదితరులు పాల్గొన్నారు.