06-08-2025 01:50:04 AM
- ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 25కి వాయిదా
- అప్పటివరకు అరెస్ట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 5 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం, అప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయకుండా ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగించింది.
ఈ కేసులో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అందువల్ల ఆయనను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా, సిట్ అధికారులే విచారణ పేరుతో తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్‌రావు మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పరస్పర పిటిషన్లపై విచారణ సందర్భంగా, కేసు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, విచారణలో రాష్ర్ట ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, కేసు దర్యాప్తు ఇంకా కీలక దశలో కొనసాగుతోంది, కనుక స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు.
పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి కల్పించిన మధ్యంతర ఉపశమనాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో, తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 25న ప్రభుత్వం సమర్పించే స్టేటస్ రిపోర్టు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.
8న సిట్ విచారణకు బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ నెల 8న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరుకానున్నారు. కేవలం బాధితుడిగా తన వాంగ్మూలం ఇవ్వడమే కాకుండా, ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాలు సేకరించిన కీలక సమాచారాన్ని, పక్కా ఆధారాలను ఆయన సిట్‌కు సమర్పించే అవకాశం ఉం దని తెలుస్తున్నది.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఫోన్‌తో పాటు, తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని బండి సంజయ్ గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశా రు. సిట్ దర్యాప్తులో భాగంగా, మాజీ పోలీ సు అధికారి ప్రణీత్ రావు ఫోన్‌లో లభించిన రికార్డింగ్‌లు, చాట్ హిస్టరీల ఆధారంగా బండి సంజయ్ పేరు బాధితుల జాబితాలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.