calender_icon.png 6 August, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి

06-08-2025 07:44:56 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) ఆదేశించారు. బుధవారం మండలంలోని చందారం, దౌడేపల్లి, వెంకట్రావుపేట, కొత్తూరు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద నిర్వహిస్తున్న నర్సరీలు, మొక్కలు నాటే పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. వివిధ శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషిచేసి మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, 4 దశలలో బిల్లులు సంబంధిత లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దశలవారీగా పనుల పురోగతి ఫోటోలను పోర్టల్ లో నవీకరించలని సూచించారు. చందారం, దౌడేపల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించి, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దౌడేపల్లి పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను స్వయంగా బోధించి ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. వెంకట్రావుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, ఎ. పి. ఓ. వేణుగోపాల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.