16-07-2025 05:13:58 PM
విద్యార్థుల సంఖ్యకనుగుణంగా డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయాలి
మారుపాకలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీ
సైన్స్, సోషల్, మ్యాథ్స్ పాఠాలు బోధన
ఉపాధి హామీ కింద ప్రహరీ నిర్మించాలి
లీకేజీ లేకుండా వెంటనే బాగు చేయించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతెలిపారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలోని అంగన్వాడి , ప్రీప్రైమరీ,ప్రైమరీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి శుభ్రం చేయించాలని పంచాయత్ సెక్రటరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.బడి బాట కార్యక్రమం లో ఏమి చేశారని ప్రశ్నించారు.
ప్రైమరీ స్కూల్లోని తరగతి గదిలో విద్యార్థుల బెంచీలు సరైన క్రమంలో ఏర్పాటు చేసి వారికి వీలైనంత సువిశాల గదిని కేటాయించాలని, రంగులు వేయించాలని సూచించారు.ఉపాధి హామీ కింద ప్రహరీ గోడ నిర్మించాలి. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెస్క్ బెంచీలు లేకపోవడం గమనించి వెంటనే ఇతర పాఠశాలల్లో అధికంగా ఉన్న వాటిని ఇక్కడికి వెంటనే తెప్పించి, ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలకు సరైన ప్రహరీ ఉపాధి హామీ కింద నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
సైన్స్, సోషల్, మ్యాథ్స్ పాఠాలు బోధన
విద్యాలయంలోని 8,9,10 విద్యార్థులకు సైన్స్, సోషల్ మ్యాథ్స్ పాఠాలు బోధించారు.విద్యార్థులను ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు విద్యార్థులకు సరైన విధంగా విద్యాబోధన చేయవలసిందిగా ఉపాధ్యాయులకు ఆదేశించారు.లీకేజీ లేకుండా వెంటనే బాగు చేయించాలి. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల బరువును చెక్ చేశారు. పాఠశాల పరిసరాలు మొత్తం కలియతిరిగి పరిశుభ్రంగా లేకపోవడం గమనించి వెంటనే శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. అంగన్వాడి భవనం వాటర్ లీకేజీ లేకుండా వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు.విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వంటగదిని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.