16-07-2025 04:58:22 PM
అర్జీ-2లో ఆషాడ మాసం అమ్మవారి బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్
గోదావరిఖని,(విజయక్రాంతి): అమ్మా రామగుండం ప్రజలను చల్లంగా చూడు తల్లి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అమ్మవారిని వేడుకున్నారు. బుధవారం ఆషాడ మాసం అమ్మవారి బోనాల కార్యక్రమంలో అర్జీ-2 పరిధిలోని ఓసీపీ -3 ప్రాజెక్టులోని కృషీ భవన్ వద్ద నిర్వహించిన "దుర్గా దేవి మైసమ్మ తల్లి బోనాల జాతరలో" ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. రామగుండం ప్రాంతంలోని ప్రజలందరూ పాడిపంటలతో సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే అమ్మవారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... మాట్లాడుతూ బోనాలు జాతర అంటే అమ్మవారిని పూజించే పండుగ అని, జులై నెల ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాలు ప్రారంభమవుతాయని. ఆ పండుగ మొదటి రోజునుండి, నెల చివరి రోజువరకు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారని, బోనం అంటే భోజనం అని అర్థమని, అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారని అన్నారు. ముఖ్యంగా స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారన్నారు.
కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారని, వేప ఆకులు, పసుపు, కుంకుమతో కుండను అలంకరిస్తారరి, మహిళలు అందంగా ముస్తాబై తల మీద ఈ కుండను మోస్తూ ఆలయాలకు తీసుకుని వెళతారని, గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకలమ్మ మొదలైన రూపాలలో కాళికా దేవిని పూజిస్తారని తెలిపారు. మహిళలు తాము సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారని, అమ్మవారి జాతర వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అందరూ ఎల్లప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో కొందరు భక్తులు నృత్య ప్రదర్శన చేశారు.