16-07-2025 05:16:29 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని 37 గ్రామాల్లో ఉన్న రైతాంగం సర్వేయర్ సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ యొక్క భూముల ఎక్కువ, తక్కువలను సరి చేసుకునేందుకు అనేకమంది తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని వెంటనే అదనపు సర్వేయర్ నియమించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ దశరథ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ... జిల్లాలోని అతిపెద్ద మండలంగా ఉన్న వలిగొండ మండలానికి ఒక్కరే సర్వేయర్ ఉండడంతో వారు సక్రమంగా రైతులకు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఒకవైపు ఉన్న ఒక్క సర్వేయర్ ను బునాది గాని, ధర్మారెడ్డి పల్లి, మరియు కాలేశ్వరం కాలువల సర్వేల కోసం పై అధికారులు నిరంతరం పంపుతుండడంతో సర్వేయర్ అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పంట పొలాలను కొలిచేందుకు రోజుల తరబడి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా స్థాయి రెవిన్యూ అధికారులు స్పందించి మండలానికి అదనంగా సర్వేయర్ ను నియమించాలని రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.