15-04-2025 12:00:00 AM
ధరణి సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నేటినుంచి ప్రారంభించిన భూభారతి చట్టానికి హార్దిక స్వాగతం చెబుతున్నాం. భూముల రిజిస్ట్రేషన్‌లలోని సమస్యలు, వివాదాలను పరిష్కరించడంలో ఈ కొత్త చట్టం వినూత్న, విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశిస్తున్నాం. ఈ చట్టం ద్వారా తమ కష్టాలు తీరతాయని యావత్ తెలంగాణ సమాజం ఆశిస్తోంది. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతో దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇది ఎంతైనా సంతోషించదగ్గ విషయం.
-మోహన, లంగర్‌హౌజ్, హైదరాబాద్
పఠనంపై ఆసక్తిని పెంచుకుందాం!
ఈ డిజిటల్ యుగంలో టెక్నాలజీ ప్రభావం వల్ల పుస్తక పఠనం మందగిస్తున్నది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యువతరాన్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం అనే అలవాటు బాగా తగుతున్నది. ముఖ్యంగా ఈతరం వారు రీడింగ్ విలువను తెలుసుకోవాలి. చాలామందికి తెలియని విషయమేమిటంటే, పఠనం ద్వారా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. ఈ అభిరుచి మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని నిపుణులు అంటారు. చదవడం కారణంగా ఆలోచనలు శక్తివంతంగా ప్రేరేపితమువుతాయి. అవి మన స్వభావాన్ని కూడా మార్చగలవని వారంటున్నారు. పఠనం ఏకాగ్రతను పెంచడమేకాక మెదడుకు వ్యాయామం వంటిదన్న సంగతీ ఈతరం వారికి తెలియదు. చదవడం వల్ల మన సృజనాత్మకత పెరుగుతుంది. అంతేకాక, మనలోని పరిష్కార నైపుణ్యాలను, విశ్లేషణాత్మక శక్తిని పఠన అభిరుచి మరింతగా మెరుగు పరుస్తుంది.
-డా. కృష్ణకుమార్ వేపకొమ్మ, హైదరాబాద్
అలాంటివారిపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సామాజిక మాధ్యమాలలో రేగిన రగడ ఇంతా అంతా కాదు. హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై అధిక దూరం అలుపుతో ప్రయాణించటం, మద్యం సేవించి ఉండటం వల్ల వాహనంపై అతను అదుపు కోల్పోయినట్లు అర్థమవుతున్నది. రాజమహేంద్రవరం వద్ద ప్రమాదానికి గురైనట్లు పోస్ట్‌మార్టం నివేదిక, పోలీసుల పరిశోధన ద్వారా తేలింది. ఇవి ఆయన మృతిని నిర్ణయించటంలో కీలకమయ్యాయి. కాగా, సామాజిక మాధ్యమాలలో ఈ విషయంపై చర్చోపచర్చలు పెద్ద పెట్టున జరిగాయి. ఇలా పలు రకాల వదంతులను వ్యాపింపజేయడం భావ్యం కాదు. వాస్తవాలు ఏవైనా, ఎంతటి వారైనా నిలకడ మీద తెలియకపోవు. వదంతులకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించవలసిన బాధ్యత ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనా ఉంది.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్