15-04-2025 12:00:00 AM
మనది నిజంగా ఘనమైన ప్రజాస్వామ్య దేశమేనా?! అయితే, ఇక్కడ ఏదేని రాష్ట్రంలో ఇంకా ఏదేని నగ రం, పట్టణం చివరకు ఒక చిన్న గ్రామంలో అయినా అక్కడ పనిచేసే ఓ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి సేవలకు రేటింగ్ (పని నాణ్యత స్థాయిని నిర్ణయించడం) ఇచ్చే సదుపాయం ప్రతీ బాధ్యతగల పౌరునికి ఎందుకు లేదు? రాజకీయ నాయకు లకైతే ఎలాగూ, ఎన్నికల సమయంలో ఏదో రూపంలో వారి పని తీరు నిర్ణయం అన్నది ప్రజల ముందుకు వస్తుంది.
కానీ, బ్యూరోక్రసీ (కేంద్రీకృత ప్రభుత్వ విధానాలతో కూడిన వ్యవస్థ)లోని వారి సేవలు, విధుల స్థాయి నిర్ణయాధికారం మన దేశ పౌరులకు ఎందుకు ఉండకూడదు?! ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలు పడుతున్న బాధలు, అవస్థలు అన్నీ ప్రైవేట్ వ్యవహారమే కావ చ్చు. కానీ, వాటికీ అందరం ఎంతో కొంత మూల్యం (ప్రభుత్వ వేతనాలు లేదా రుసు ము) చెల్లించుకుంటున్నాం కదా!? అలాంటప్పుడు ఈ దేశ పౌ రులుగా మనకెందుకు ఆ అధికారం లేదా హక్కు ఉండకూడదో ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నడవడానికి అత్యంత మూలమైన పౌరులు ఈ (సోకాల్డ్) అధికారిక వ్యవస్థకు ఇలా ఒక అనధికార బందీలుగా కొనసాగడం ఎంతవరకు న్యాయం?
ప్రజల రేటింగ్ తప్పనిసరి చేయాలి
ప్రజాభిప్రాయం అన్నది పౌరసేవా మూల్యాంకనాలకు ఒక మూలస్తంభంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వ ఉద్యోగుల పదోన్నతులు, జీతాలు తప్పనిసరిగా పౌరుల రేటింగ్ ఆధారంగా జరగా ల్సిన పరిస్థితి రావాలి. మన దేశంలోని దా దాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ పౌరులు అధికారిక పనులు చేసుకోలేక నిస్సహాయులవుతున్న దృశ్యాలు నిజంగా కోకొల్లలు. ఆస్తిని నమోదు చేయడం, లైసెన్సును పునరుద్ధరించడం లేదా ప్రాథమిక సర్టిఫికేట్ పొందడం వంటివి ఏవైనా ప్రభు త్వ సంబంధ పనులు పూర్తి పారదర్శకంగా, సులభంగా, సౌకర్యవంతంగా అవుతున్నా యా? చాలామంది అధికారుల నుంచి కిం దిస్థాయి సిబ్బంది వరకూ అనేకమంది అస లు ఎక్కడా అధికారికంగా స్పష్టంగా లంచా లు అడగరు.
కానీ, వారు లంచం లేకుండా లేదా తమకు అందాల్సిన కమిషన్ అందకుండా పనులు పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. ఇది నేరుగా కాకుండా తరచుగా ఒక ఏజెంట్ ద్వారా లేదా అటువంటి అనధీకృత వ్యవస్థ ద్వారా జరుగుతూ వుంటుం ది. ఈ ఉదాసీనత, జవాబుదారీతనం లేని సంస్కృతి కారణంగా ప్రభుత్వ యంత్రాం గం, మొత్తంగా బ్యూరోక్రసీ వ్యవస్థపైనే ప్రజలలో అవిశ్వాసం పెరుగుతున్నది.
ప్రతి చోటా హెల్ప్‌డెస్క్‌లు ఉండాలి
బాధ్యతగల పౌరులుగా ఎంతోమంది ప్రజలు దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఉదా॥ సైనికులు, రైతులు, ఇతర వృత్తి నిపుణులు అందరూ ఎలాంటి అవిశ్వాస పరిస్థితికి తావివ్వకుండా పని చేస్తారు. కానీ, పౌరులకు సేవ చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ రంగ సంస్థలు అహంకారం, నిర్లక్ష్యంతో పని చేస్తున్న స్థితిగతులను మనం ఎప్పటికీ మార్చుకుంటామో తెలియడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనులు అంటేనే ప్రజలు భయపడి పోతున్నారంటే అతిశయోక్తి కాదు.
బ్యాంకులలో మాదిరిగా మరే ప్రభుత్వ కార్యాలయంలో నూ హెల్ప్ డెస్క్‌లు అన్నవే ఉండవు. వీటిని తప్పనిసరి ఏర్పాటు చేయాలి. రిసెప్షన్లు నామమాత్రంగానే వుంటాయి. నూటికి తొంభై తొమ్మిది మందికి సమయపాలన ప ట్ల గౌరవం లేదు. వారు తమ పనిని చేయ డం ద్వారా మీకు సహాయం చేస్తున్నారని సూచించే వైఖరి అస్సలు కనిపించదు. ఇదేం ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదు.
మన దేశంలోని బ్యూరోక్రసీలో ఏజెం ట్ల వ్యవస్థ ఎంతగా వేళ్ళూనుకు పోయిందో చెప్పడానికి ఈ కింది ఒక్క ఉదాహరణ చాలు. బెంగళూరులో 2,000 కంటే ఎక్కు వ ఫ్లాట్లతో, ఒక ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థ నిర్మించిన ఒక పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తే విషయం బోధపడుతుం ది. అపార్ట్‌మెంట్లను నమోదు చేయడానికి, అందరు నివాసితులు బిల్డర్ సిఫార్సు చేసిన ఏజెంట్ ద్వారా మాత్రమే వెళ్లాలని సూచించారు.
మున్సిపల్ అధికారులతో నేరుగా సంభాషించడానికి ఎటువంటి ఎంపిక, అవకాశమూ లేకపోవడం ఆశ్చ ర్యం. అందులోని నివాసితులలో ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, చట్టాలను అమలు చేసే అధికారులు కూడా ఉన్నారు.- అయినప్పటికీ అందరూ దీనికి అంగీకరించి నడుచుకొంటున్నారు. అంగీకరించక తప్పని పరిస్థితి. వారిని కాదని ముందుకు వెళితే ప్రత్యక్ష లేదా పరోక్ష వేధింపులు తప్పవు.
బాధ్యత ఉన్నతాధికారులదే!
ప్రజలతో వ్యవహరించే కార్యాలయా లు స్పీడ్ మనీతో నడుస్తాయనేది బహిరంగ రహస్యం. కానీ, ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ విభాగాలను పర్యవేక్షించే అత్యం త గౌరవనీయమైన ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర పరిపాలనా అధికారులు వంటి ఉన్నతాధికారులు సైతం ఈ రకమైన సంస్కృతికి అలవాటు పడటమో లేదా అందులో భాగస్వాములుగా ఉండటమే జరుగుతున్నది. పెద్దపె ద్ద హోదాల్లో ఉండికూడా వారు ఈ రకమైన అనారోగ్యకర సంస్కృతిని సరిదిద్దే ప్రయత్నాలు ఎందుకు చేయరు? వారికి ఇలాంటివన్నీ తెలియవని అనుకోవడానికి ఏ మాత్రం వీలులేదు. లేదా దానిని సవాలు చేయడానికి ఈ అధికారులకు ధైర్యం చాల డం లేదనుకోవాలి. ఇంత ఉన్నత స్థాయి అ ధికారులే తమ పర్యవేక్షణలో కుళ్ళిపోతున్న సంప్రదాయాన్ని సరిదిద్దలేకపోతే ఎలా?
మరో అద్భుతమైన సంఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఒక స్నేహితుడి కుమార్తె తమ వివాహ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించింది.- ఆధార్ వివరాలను సమర్పించడం ద్వారా ధృవీకరించింది. కానీ స్పీడ్ మనీ చెల్లించిన తర్వాతే ఫైల్ రిజిస్ట్రార్‌కు చేరుకుంటుంది. ఇలా ఎన్ని సంఘటలనైనా చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు అన్ని కార్యాలయాల్లోనూ ఈ అవినీతి, పక్షపాతం, నిర్లక్ష్యం, మధ్యదళారీల జాడ్యం కొనసాగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.
దేశంలోనే అత్యవసర సంస్కరణ
నానాటికీ దేశంలో ఈ రకమైన బ్యూరోక్రటిక్ అవినీతి జాడ్యంవలె పెరిగిపోతు న్నది. ప్రతి లావాదేవీ తర్వాత ఉబెర్ డ్రైవ ర్లు, స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు మనం రేటింగ్ ఇస్తుం టాం. అలాంటిది మన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ప్రభుత్వ అధికారుల చర్యలను ఎందుకు రేట్ చేయ కూడదు? ప్రజాభిప్రాయం పౌర సేవా మూల్యాంకనాలకు మూలస్తంభంగా మా రాల్సిన సమయం కోసం ఇప్పటికైనా అందరం పోరాడాల్సిందే. దీనిని దేశంలో అత్యవసరమైన సంస్కరణగా భావించాలి. కెరీర్ బెంచ్‌మార్క్‌గా ప్రజాభిప్రాయం వుండాలి.
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, జీతాలు నేరుగా పౌరుల అభి ప్రాయంతో ముడిపడి ఉండాలి. ఉద్యోగి అంచనాలో కనీసం 50 శాతం సామర్థ్యం, న్యాయమైన ప్రవర్తన, ప్రజా రేటింగ్‌లపై ఆధారపడి మాత్రమే జరగాలి. అప్పుడే సమాజం ఆదర్శవంతమవుతుంది. ఈ గుణాత్మక, నిర్మాణాత్మక మార్పు కోసం ఇప్పటినుంచే ప్రయత్నిద్దాం.
-దోర్బల బాలశేఖరశర్మ