02-01-2025 12:00:00 AM
తెలంగాణ గడ్డమీద కత్తి పట్టిన బహుజన వీరుడు ఆయన. ఆర్య సమాజంలో చేరి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆరడుగుల తెలంగాణ పౌరుషం బత్తిని మొగిలయ్య గౌడ్. మొగిలయ్య వరంగల్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయో ధుడు. రజాకార్లను ఎదిరించి పోరాడారు. వరంగల్ తూర్పు కోటలో 1918 జనవరి 2న జన్మించారు. తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు. ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకొని, కోట బడిలో 4వ తరగతి వరకూ చదివారు.
ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే వారు. అన్న రామస్వామి భూపతి కృష్ణమూర్తి, ఇతర కాంగ్రెస్ వాదులతో కలిసి కాంగ్రెస్, ఆర్యసమాజ్ మీటింగ్‌లకు వెళ్లేవారు. గౌడ కులవృత్తి అయిన తాళ్లు ఎక్కుతూ, వ్వవసాయం చేసేవారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరితో స్నేహంగా ఉండేవారు. ఆనాటి సమాజంలో గౌడ్‌ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. భూమిమీద పన్నులు వసూలు చేసినట్లుగానే నిజాం కల్లుమీద, తాటిచెట్లపైనా పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు కట్టని గౌడులకు విధించే శిక్షలు అతి దారుణంగా, క్రూరంగా ఉండేవి.
స్వాతంత్య్ర అభిలాషను సమాజంలో విస్తృత పరిచే దిశగా 12వ జాతీయాంధ్ర మహాసభలు 1946లో వరంగల్‌లోని మడికొండలో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగుర వేయాలనుకున్నారు. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రతి ఆదివారం వరంగల్‌లో చైతన్యవంతులైన యువకులు, కాంగ్రెస్ నాయకులు, ఆర్యసమాజ్ కార్యకర్తలు కోటలో జెండా ఎగుర వేసేవారు.
కత్తి యుద్ధంలో కడతేరిన వీరుడు
ఆ రోజు 11 ఆగస్టు 1946. ఆదివారం ఉదయం 7.30 గంటలు. వరంగల్ తూర్పుకోటలో జెండా ఎగుర వేయడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ నాయకులు యం.యస్. రాజలింగం, టి.హయగ్రీవా చారి, భూపతి కృష్ణమూర్తి, మడూరి రాజలింగం, బత్తిని సోదరులు అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవచారి జెండాను ఎగురవేయగా, పిల్లలు పెద్దలంతా జై కొట్టారు. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అప్పుడే ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో సుమారు 200 మంది రజాకార్లు, వారి అనుయాయులు మారణాయుధాలతో వచ్చారు. ఎగిరిన జెండాను చూసిన వారి కోపం కట్టలు తెంచుకుంది.
రామస్వామి గౌడ్ ఇంటివైపు అరుస్తూ, తిడుతూ వచ్చారు. జెండా ఎత్తిన నాయకులందరినీ మట్టుబెట్టాలని చూసారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య, అనంతరం తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్లారు. ఆయన భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత. పురిటి బిడ్డతో మంచంపై ఉంది. రజాకార్ల దాడితో భార్య, తల్లి చెన్నమ్మ భీతిల్లి పోయారు. శనిగరం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలోని మొగిలయ్యను కలిసి విషయం చెప్పాడు.
మరుక్షణం తన ఇంటివైపు పరుగుతీసారు. ఏ క్షణమైనా ఇంట్లోని వాళ్లంతా రజాకార్ల చేతుల్లో చనిపోయేట్టుగా ఉన్నారు. రజాకార్ల కంట బడకుండా వెనుక దర్వాజా గుండా ఇంట్లోకి వెళ్ళి మెరుపు వేగంతో సూరులోని తల్వార్‌ను తీసుకొని మెరుపులా రజాకార్ల మధ్యకు వచ్చారు. అరుస్తూ రజాకార్లపై పడి నరకడం మొదలుపెట్టాడు.
నాయకుడు షరీఫ్‌సహా రజాకార్లంతా చెల్లాచెదురయ్యారు. అదును చూసి రజాకార్లు తిరిగి మొగిలయ్యపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రెండవసారి జరిగిన దాడిలో మొగిలయ్యదే పైచేయి అయ్యింది. కానీ, మూడవసారి జరిగిన దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో రాగా, మొగిలయ్య కత్తి పందిరి గుంజల మధ్య చిక్కుకుంది.
ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెలమీద పొడిచాడు. ఇంకేముంది, రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు. నిష్కళంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వం చిరస్మరణీయంగా నిలిచి పోవాలని వరంగల్ నడిబొడ్డున జెపిఎన్ రోడ్‌లో 1954లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ఈ నాయకుని పోరాటపటిమ వెలకట్టలేనిది.
కామిడి సతీష్‌రెడ్డి