1 May, 2026 | 4:49 PM

సమరశీల సంపన్నుడు

06-02-2025 12:00 AM

మన దేశానికి చెందిన అత్యున్నత అవార్డు భారతరత్న ను మొట్టమొదటిసారిగా 1987లో ఒక విదేశీయుడికి ఇచ్చారు. ఆయనే ‘సరిహద్దు గాంధీ’గా పేరు గాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్. భారతదేశపు  స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక దేశభక్తుల జాబితాలో, సరిహద్దు ప్రాంతాలలో నాయకత్వం వహించి, మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించిన వారిలో గఫార్ ఖాన్ ప్రముఖుడు.

అవిభక్త భారతదేశంలో వాయవ్య ప్రాంతంలో ప్రజలను సమీకృత పరచి గాంధీజీ విధానాల ప్రకారం, అహింసా ఉద్యమం నిర్మించిన సమరశీల సంపన్నుడాయన. గఫార్ ఖాన్ మంచి గౌరవం గల పఠాన్ నాయకుల కుటుంబంలో 1890 ఫిబ్రవరి 6న ఉస్మాన్‌జాయి, చార్సద్ద అవిభక్త భారత్‌లో జన్మించారు.

మొత్తం ముస్లిం లీగ్ ఉద్దేశ్యం, మహమ్మదీయులను స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సామాన్య జన జీవనం నుంచి దూరంగా ఉంచి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వేరు చేయటానికేనని ఆయన  గ్రహించారు.

బ్రిటీష్ ప్రభుత్వం వారు ఆయన కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగిలారు. ఆయనను, ఆయన అనుచరులను ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో బంధించింది.  

మహాత్మాగాంధీతో తీవ్రంగా ప్రభావితుడై చేసిన పనులకుగాను కొద్ది రోజులలోనే ప్రజలు ఆయనను ‘సరిహద్దు గాంధీ’ అని పిలవటం మొదలుపెట్టారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, దేశ విభజన తరువాత వీరు నివసిస్తున్న ప్రాంతమంతా పాకిస్తాన్‌తో కలిపివేయబడింది. 

స్వాతంత్య్రానికి ముందు, 15 ఏళ్లపాటుచ స్వాతంత్య్రం వచ్చాక 16 ఏళ్లు పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవించారు. భారత ప్రజలకు ఈ ప్రశాంత చిత్త నాయకుడంటే అంతులేని గౌరవం ఉంది. 1969లో భారత ప్రభుత్వపు ప్రత్యేక ఆహ్వానం మీద ఆయన భారతదేశంలో పర్యటించి ప్రజలను అనేక ప్రాంతాలలో కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు.

స్వాతంత్య్రం సంపాదించిన తరువాత విద్యా, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందటాన్ని ఆయన చాలా ప్రశంసించారు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు 1987లో తాను చేసిన నిస్వార్థ త్యాగం, సేవలకుగాను భారత ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రదానం చేసింది. గఫార్‌ఖాన్ 98 సంవత్సరాల వయస్సులో 1988 జనవరి 20న తనువు చాలించారు. 

 గడప రఘుపతిరావు