ఇంకెన్నాళ్లు ఈ వివక్ష?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి సందేశం ఇస్తోంది? భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన పుట్టిన గడ్డ, కాళోజీ రచనలతో విప్లవ సిరా చుక్కలు నిండిన గడ్డ, మహాకవి దాశరథి, సినారె లాంటి ఎందరో మహాకవులు, కళాకారులు, వీరులు, వీర వనితలు, విద్యావేత్తలు పుట్టిన తెలంగాణకు కేంద్రం పురస్కారాల విషయంలో వివక్ష చూపుతోంది.
పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికితె భవహరమగునట పలికెద వేరుండు గాధ పలకగ నేల.. ఇది ‘భాగవతం’ రచించిన మహాకవి బమ్మెర పోతన కలం నుంచి జాలువారిన పద సంపద. ‘నేనంటే నేడు.. నా గొడవ అంటే నాడు.. నిజమో కాదో కల రుజువు.. నీవు, నేను, వాడు.. నేనంటే రేపటి మనం..’
ఇది ప్రజాకవి కాళోజీ నారాయణరావు పెన్నునుంచి జాలు వారిన అభ్యుదయ గళం. ఇప్పుడు వారి గురించి ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? అంతటి గొప్ప కవులు ఎందరో పుట్టిన నేల మన తెలంగాణ. తెలంగాణ కవులు, కళాకారుల గురించి గొంతెత్తి చెప్పుకుంటే తప్ప తెలియని పరిస్థితులు దాపురిస్తున్నాయి కాబట్టి. వారికి దక్కాల్సిన గౌరవాలు దక్కనప్పుడు అస్తిత్వ గొంతుక ఉప్పెనలా లెగుస్తుంది కాబట్టి.
కేంద్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, వివిధ రంగాల్లో సేవలు అందించే వారికి అందించే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల పంపకంలో తెలంగాణపట్ల వివక్ష చూపిందని ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘తెలంగాణలో కవులు, కళాకారులు లేరు’ అన్నట్టుగా ఎన్నో దశాబ్దాలుగా పాలకులు వ్యవహరిస్తుండటం వల్లనే ఈ ప్రాంతం అస్తిత్వంతో ఎగసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొంది. అయినా, ‘తెలంగాణ ప్రాంతం పట్ల ఇంకా ఎందుకు ఈ వివక్ష?’ అని తాజా పద్మ అవార్డుల పంపకం నేపథ్యంలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
చర్చకు తావిచ్చిన మంత్రి వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కవులు, కళాకారులు, వివిధ రంగాల్లో సేవలు అందించిన మహనీయులకు అందించే పద్మ పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఎక్కువ, మరో రాష్ట్రానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని వాటి పంపిణీ తీరును పరిశీలిస్తే అర్థమవుతుంది.
‘ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వలేదనే’ ప్రశ్నకు బిజెపి నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. “మావోయిస్టు భావజాలంతో ఎందరో బిజెపి కార్యకర్తలు, జాతీయ వాదులను పొట్టన బెట్టుకున్న గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?” అని బండి సంజయ్ అన్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది.
‘పద్మ అవార్డుకు గద్దర్‌కు అర్హత ఉందా? లేదా?’ అనేది బండి సంజయ్ నిర్ధారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆయనను కళల విభాగంలో తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది కాబట్టి. గద్దర్ జీవితం మొదటి అంకంలో మావోయిస్టుగా ఉన్నప్పటికీ ఆ తర్వాతి కాలంలో ఆ పంథాను వదిలి ప్రజా కళాకారుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
జానపద కళ గురించి ప్రస్తావించాల్సి వస్తే మొదట ప్రతి తెలుగువాడి గుండెలో మెదిలే ఏకైక పేరు గద్దర్. “బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడా..” అన్న పాటను తాను రాయకపోయినా ఆ రచనకు ప్రాణం పోశాడు. నటించి నాట్యమాడి గాత్రం ఇచ్చి నిరంకుశ నైజాం పాలనను ఎదిరించిన వాగ్గేయకారుడు గద్దర్.
“అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా..” అంటూ తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రాంత పరిస్థితులను వర్ణించిన తీరు, “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా..” అంటూ కాళ్ళకు గజ్జె కట్టి చిందేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నడుం బిగించిన వైనం.. తెలంగాణ ప్రజల హృదయాల్లో గద్దర్‌ను చిరస్థాయిగా నిలిపింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చాలా కీలకమైంది.
మూర్ఖత్వం కాకపోతే మరేమిటి?
ప్రతి జిల్లాకు గజ్జె కట్టి తన గలంతో చిందులేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను తెలుపుతూ, తెలంగాణ ఏర్పాటుకు గద్దర్ చేసిన కృషిని ఏ తెలంగాణ వాదికూడా మర్చిపోలేడు. అలాంటి ఆయనను, ఆయన జీవిత ప్రథమార్ధంలో మావోయిస్టుగా ఉన్న నేపథ్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని పద్మ అవార్డుకు తిరస్కరించామని,
ఆయనకు పద్మశ్రీ అర్హత లేదని చెప్పడం నిజంగా మూర్ఖత్వంగానే భావించాలి. సరే, బీజేపీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వడానికి మావోయిస్టు భావజాలం అనే సాకు దొరికిందని అనుకుందాం. అలాంటప్పుడు మందకృష్ణ మాదిగ కూడా ఒకప్పుడు మావోయిస్టు భావజాలంతోనే పోరాడారు. మరి, ఆయనకు పద్మ అవార్డు ఎందుకిచ్చినట్టు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ అవార్డుల’ నామినేషన్ కోసం పంపిన జాబితాలో ఉన్నది ఒక్క గద్దర్ పేరు మాత్రమే కాదని బండి సంజయ్ ఎందుకు గుర్తించలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందె శ్రీ, జానపద వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, విద్యావేత్త చుక్కా రామయ్య పేర్లను సైతం తెలంగాణ సర్కార్ పంపిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
అలాంటప్పుడు అందెశ్రీ, గోరేటి వెంకన్న, చుక్కా రామయ్యలకు సైతం పద్మ అవార్డు దక్కలేదన్నది గమనార్హం. కేవలం పద్మ అవార్డుల విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనూ తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సవతి తల్లి ప్రేమనే చూపుతోంది. గతంలో ఒకరిద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న స్థాయినుంచి పార్టీని తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటూ,
నేడు 8 ఎంపీ సీట్లతోపాటు చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టారు. అయితే, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎంత ఆదరించినా తెలంగాణ ప్రాంతం పట్ల వారి వైఖరి మాత్రం మారడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప ఇతర జిల్లాలన్నీ చెప్పుకోదగ్గ అభివృద్ధికి నోచుకోక, వెనుకబాటుతనంలోనే ఉన్నాయి.
‘ఆయా జిల్లాలకు, ప్రాంతాలకు గడచిన పదేళ్లలో బీజేపీ సర్కార్ ఎన్ని నిధులు కేటాయించింది? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పార్టీ పాటుపడిన చరిత్ర ఏంటి?’ అని ప్రశ్నిస్తే వారు ఏం సమాధానం చెప్పగలరు?
పద్మ అవార్డుల కోసం ఆరుగురిని నామినేట్ చేస్తే, అందులో కేవలం ఇద్దరికి మాత్రమే పురస్కారాలు ప్రకటించడం పట్ల కేంద్రం వైఖరి ఏంటి? పొరుగు రాష్ట్రానికి ఐదు పద్మ పురస్కారాలు ఇచ్చి తెలంగాణకు రెండంటే రెండే ఇచ్చారు.
తద్వార కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి సందేశం ఇస్తోంది? భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన పుట్టిన గడ్డ, కాళోజీ రచనలతో విప్లవ సిరా చుక్కలు నిండిన గడ్డ, మహాకవి దాశరథి, సినారె లాంటి ఎందరో మహాకవులు, కళాకారులు, వీరులు, వీర వనితలు,
విద్యావేత్తలు పుట్టిన తెలంగాణకు కేంద్రం పురస్కారాల విషయంలో వివక్ష చూపుతోంది. ఇప్పటికైనా నిధులు, అవార్డులు, రివార్డులు, ఇతరత్రా ఏ విషయాల్లోనూ తెలంగాణ పట్ల వివక్ష చూపకుండా బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం మెదలుకోవడం మంచిదని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.






