ట్రంప్ నియంత పోకడ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి నెలరోజులు కూడా కాకముందే రోజుకో వివాదాస్పద ప్రకటనతో ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా వివాదాస్పదుడిగానే ముద్రపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమినుంచి గుణపాఠం నేర్చుకుని ఉంటారని, ఈ సారి దేశ ప్రయోజనాలపైన ఎక్కువగా దృష్టిపెడతారని అందరూ భావించారు.
అయితే ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేదని గత 15 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారం చేపట్టిన తొలిరోజే అమెరికాలో పుట్టిన ఇతర దేశాల వారి పిల్లలకు పౌరసత్వం కల్పించే విధానానికి స్వస్తి చెబుతూ నిర్ణయం తీసుకోవడంతో మొదలైన ఆయన పాలన వివాదాలమయంగానే కొనసాగుతోంది.
అక్రమ వలసలకు అడ్డుకట్ట పేరుతో దేశంలోకి అక్రమంగా అడుగుపెట్టిన వారినందరినీ తిప్పి పంపడం మొదలుపెట్టారు. మరోవైపు కెనడా, మెక్సికో, చైనాలనుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
అంతేకాదు భారత్ లాంటి మిత్రదేశాలతో పాటుగా తమ మాట కాదన్న ఏ దేశంపైనైనా అధిక సుంకాలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువను స్వాధీనం చేసుకొంటామంటూ బెదిరించారు. తమ మాట వినకపోతే డబ్ల్యూటీవోలాంటి అంతర్జాతీయ సంస్థలనుంచి కూడా తప్పుకొంటామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు.
తాజాగా పాలస్తీనియన్లందరూ వేరే చోటికి తరలిపోతే గాజా ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుని దాన్ని పునర్నిర్మిస్తామంటూ మరో వివాదానికి తెరదీశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మీడియా సమావేశంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే ట్రంప్ ప్రకటనను సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఈజిప్టు, జోర్డాన్ లాంటి మిత్ర దేశాలతో పాటుగా హమాస్ లాంటి విరోధులు కూడా తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ ప్రకటన ఆయన విస్తరణ ఆలోచనకు అద్దం పట్టేదిగా ఉందన్న సౌదీ అరేబియా స్వతంత్ర పాలస్తీనా రాజ్యం కోసం తమ దీర్ఘకాల వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మధ్యప్రాచ్యంలో రెండుదేశాల పరిష్కారానికి దీర్ఘకాలంగా మద్దతు ఇస్తున్నామని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రతిపాదన ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతను సృష్టించడానికి చేసిన ఓ ప్రయత్నంగా ఇజ్రాయెల్‌తో దీర్ఘకాలంగా పోరాడుతున్న హమాస్ మండిపడింది. ఇక స్వదేశంలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రాట్లు కూడా ట్రంప్ ప్రకటనను అభ్యంతరకరమైన, ప్రమాదకర పిచ్చి వ్యాఖ్యలుగా విమర్శిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన ఎవరైనా సరే ముందుగా తమ దేశ ప్రజలకు ఎలా మేలు చేయాలనే విషయాన్ని ఆలోచిస్తారు. అలాంటి నిర్ణయాలతో వారి మనసులను దోచుకుంటారు. ఆ తర్వాత ఇతర విషయాలపై దృష్టిపెడతారు. కానీ ట్రంప్ మాత్రం ఓ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడినన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఆయన నిర్ణయాలు, ప్రకటనలు అన్నీ కూడా ఓ నియంత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. సామ్రాజ్య విస్తరణ కాంక్షకు అద్దం పడుతున్నాయి.
ఇన్ని దేశాలను చెడ్డ చేసుకుని ఆయన సాధించేది ఏమిటి? ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా మారిన ఈ పరిస్థితుల్లో ఆయన నెపోలియన్‌లాగా తన మాటకు అడ్డొచ్చిన వాళ్లందరికీ అణగదొక్కేస్తానన్నట్లుగా వ్యవహరిస్తే నాలుగేళ్ల పాటు పాలన ఎలా సాగిస్తారు? ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికా ఎంత చులకన అవుతుందో ఆయన ఆలోచించడం లేదనిపిస్తుంది.
వాస్తవానికి అమెరికా ఓ పెద్ద వలస దేశం. అక్కడ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు నివసిస్తున్నారు. దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉంది. కానీ ట్రంప్ చర్యలు ప్రతి వర్గాన్ని దూరం చేసుకునేలా ఉన్నాయన్న భావన ఇప్పటికే మొదలైంది. ఇది మరింత పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత ట్రంప్‌పై ఉంది.






