07-05-2025 12:00:00 AM
కాటారం, మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల పక్కనే ఓ యువతిపై యువకుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం లేపింది. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే పాత కక్షలతో మహిళపై యువకుడు దాడి చేయడం సంచలనం కలిగించింది.
ఈ సంఘటనకు సంబంధించి వివరాలు... కాటారం మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన మారపాక లచ్చక్క అనే మహిళ మారపాక సారయ్య ను గత కొద్ది నెలల క్రితం హత్య చేసిన ఘటనలో లచ్చక్క నిందితురాలు. కాగా ఐదు గుంటల భూమి కోసం గతంలో హత్యకు గురైన వ్యక్తి సారయ్య కుమారుడు మారుపాక అంజి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.
తండ్రిని హత్య చేసిన ఘటనలో నిందితురాలైన లచ్చక్క పై ప్రతీకారం తీర్చుకునేందుకు మంగళవారం గొడ్డలితో అంజి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సారయ్యను హత్య చేసిన కేసులో లచ్చక్క అనే మహిళ అరెస్టు కాగా గత కొద్ది రోజుల నుంచి కండిషన్ బెయిల్ పై విడుదలై ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు కావలసి ఉంది.
ఈ క్రమంలో లచ్చక్క పై అంజి దాడి చేసినట్లు పేర్కొన్నారు. లచ్చక్క పై దాడి చేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు అడ్డగించి అంజిని ఆపడంతో, తీవ్ర గాయాలతో లచ్చక్క బయటపడినట్లు తెలిసింది. లచ్చక్క పరిస్థితి విషమంగా ఉండడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.