జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): జిల్లాలోనీ రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు.
కామారెడ్డి జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి 5,571 ఎకరాల్లో వరి నాట్లు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 250 ఎకరాల్లో మాత్రమే నాట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ గత ఏడాది ఇదే తేదీ నాటికి 2.37 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 2.64 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారని వివరించారు. రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.






