23 June, 2026 | 1:34 AM

సందుగూడెం మక్తకుంటను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు

23-06-2026 12:00 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రామచంద్రాపురం, జూన్ 22 : తెల్లాపూర్ డివిజన్ సందుగూడెం పరిధిలో గల మక్తకుంట చెరువును ఆక్రమించేందుకు ఇటీవల కొందరు ప్రయత్నిస్తున్నారని.. గజం భూమిని కబ్జా చేసినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ఆయన చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సందు గూడెం పరిధిలో గల మక్తకుంట చెరువులో ఇటీవల కొందరు వ్యక్తులు తమ శిఖం భూమి పేరుతో మట్టిని నింపుతూ చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తానే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు రావడం జరిగిందని తెలిపారు. గ్రామానికి అనుసంధానంగా గల చెరువు కట్ట రహదారిని సైతం ధ్వంసం చేయడం అత్యంత దారుణమని అన్నారు.

దశాబ్దాలుగా ఇదే రహదారిని ఉపయోగిస్తూ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చెరువు శిఖం పట్టాలో వ్యవసాయం చేయాలే తప్ప మట్టిని నింపుతూ చిరున ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా చెరువు కట్టను పునరుద్ధరించడంతోపాటు చెరువును ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నీటి పారుదల శాఖ ఈఈ భీమ్ ఆదేశించారు.

గజం భూమిని కబ్జా చేసిన వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, నీటిపారుదుల శాఖ ఈఈ బీమ్, ఏఈ జ్యోతి, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, సీనియర్ నాయకులు రమేష్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.