22-06-2025 12:35:20 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ఇద్దరు కీలక ఇంజినీర్లపై ఏసీబీ దాడులు నిర్వహించగా, వందల కోట్ల అక్రమాస్తుల చిట్టా బహిర్గతమైన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌లో భాగస్వాములైన ఇద్దరు ఇంజినీర్లను విచారిస్తేనే వందల కోట్ల అక్రమాస్తులు బయటపడితే, బరాజ్ నిర్మాణంలో పనిచేసిన పైస్థాయి అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులను విచారిస్తే వేల కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సమర్పించిన నివేదికలోనూ చాంతాడంత అధికారులు, ఇంజినీర్ల జాబితా ఉంది. మొత్తం లిస్ట్‌ను మూడు జాబితాలుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి జాబితాలోని 17 మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ కమిషన్ జాబితా ఇచ్చింది.
ఇందులో మాజీ ఈఎన్సీలతోపాటు పలువురు సీఈలు, డిప్యూటీ సీఈలు, వర్క్స్ అకౌంట్స్ విభాగానికి చెందిన అధికారులు, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, క్వాలిటీ కంట్రోల్ సీఈ, ఈఈలు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ ఈఎన్‌సీ, ఎస్‌ఈలు ఉన్నారు. ఇక రెండో జాబితాలో ఉన్న వారిపై భారీగా జరిమానా విధించాలంటూ పేర్కొన్న అధికారులు, ఇంజినీర్ల జాబితా ఉంది.
ఇందులో ఈఎన్సీలతోపాటు సీఈలు, ఈఈలు, డిప్యూటీ ఈఈలు ఇలా మొత్తం 33 మంది పేర్లతో ఈ జాబితా ఉంది. ముచ్చటగా మూడో జాబితాలో మొత్తం 7 గురు రిటైర్డ్ ఉన్నత ఇంజినీరింగ్ అధికారులు ఉండటం గమనార్హం. వీరిపై వెంటనే చార్జెస్ ఫ్రేమ్ చేయాలని విజిలెన్స్ కమిషన్ స్పష్టంగా సూచించింది.
ఇందులో మాజీ ఈఎన్సీలు, డిప్యూటీ సీఈలు, ఎస్‌ఈలు ఉన్నారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. రిటైర్డ్ ఉన్నతాధికారులపై దృష్టిసారిస్తే.. బయటపడే అక్రమాస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని సొంత నీటిపారుదల శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు.
రూ.వందల కోట్లు బట్టబయలు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు ముఖ్య ఇంజినీర్లపై తాజాగా ఏసీబీ దాడులు నిర్వహించించిన విషయం తెలిసిందే. ఈఎన్సీ హరిరాం, ఈఈ నూనె శ్రీధర్‌లపై ఏసీబీ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల విలువ అంచనా రూ.వందల కోట్లలో ఉండటం గమనార్హం.
ఈఎన్సీ హరిరాం వద్ద లభించిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల్లో సుమారు రూ.వంద కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేయగా.. ఈఈ నూనె శ్రీధర్ వద్ద లభ్యమైన ఆస్తుల విలువ సైతం రూ.100 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా కొన్ని లాకర్లు కూడా తెరవాల్సి ఉంది. బినామీల ఆస్తులపై దృష్టి సైతం సారించారు. ఇవన్నీ బయటకు వస్తే ఆదాయానికి మించిన ఆస్తుల విలువ మరింతగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది.
ఈఎన్సీ హరిరాంపై దాడుల్లో బయటపడ్డ ఆస్తులు..
ఏప్రిల్ 26న ఈఎన్సీ హరిరాం, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం 14 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. అందులో షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, శ్రీనగర్‌కాలనీ, మాదాపూర్, నార్సింగిలో ఫ్లాట్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్‌కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇండ్లు, బొమ్మలరామారంలో 6 ఎకరాల ఫాంహౌజ్, మామిడి తోట, కుత్బుల్లాపూర్‌లో ఖాళీ స్థలం, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న స్థలం, మిర్యాలగూడలో ఖాళీ స్థలం, రెండు కార్లు (ఇందులో ఒకటి బీఎండబ్ల్యూ), భారీగా బంగారు ఆభరణాలు, పెద్దఎత్తున బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా.. సిద్దిపేట జిల్లాల్లో భారీగా వ్యవసాయ భూములు, బినామీల పేర్లపై ఉన్న ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈఈ నూనె శ్రీధర్‌పై దాడుల్లో..
ఈనెల 11న ఈఈ నూనె శ్రీధర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 13 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేట్‌లో ఒక ఫ్లాట్, కరీంనగర్‌లో 3 ఫ్లాట్లు, అమీర్‌పేట్‌లో కమర్షియల్ స్పేస్, హైదరాబాద్‌లో ఒక ఇండిపెండెంట్ భవనం, వరంగల్, కరీంనగర్‌లో ఒక్కోటి చొప్పున ఇండిపెండెంట్ భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో 19 ఖాళీ ఇంటి స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.
సర్కారు నిర్ణయంతోనే..
కాళేశ్వరం నిర్మాణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎన్‌సీ హరిరాం, ఈఈ నూనె శ్రీధర్ విషయంలో ప్రభుత్వం ఏసీబీకి స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాతే దాడులకు దిగిందనే విషయం స్పష్టం. ఇదే సందర్భంగా.. విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన జాబితాపై ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఇప్పటికే కమిషన్ జాబితా ప్రభుత్వానికి చేరి సుమారు మూడు నెలల కాలం అవుతోంది.
ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే చర్చకూడా నీటిపారుదల శాఖలో జరుగుతోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయంపై ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు.. అధికారులు, ఇంజనీర్లలోనూ ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇద్దరు కీలక ఇంజినీర్లపై ఏసీబీ దాడులు చేసి ఆదాయానికి మించిన ఆస్తులను బయటపెట్టడాన్ని నీటిపారుదల శాఖలో గరిష్ఠ ఉద్యోగులు హర్షిస్తున్నారు.