పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
మేడ్చల్ కలెక్టర్‌కు విజ్ఞప్తి
మేడ్చల్, జూన్ 22(విజయ క్రాంతి):జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి వారందరికీ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని జిల్లా జర్నలిస్టు ప్రతినిధులు కలెక్టర్ మను చౌదరిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా అర్బన్ జిల్లా కావడం వల్ల ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రతి మండలంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది విలేకరులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
అక్రిడిటేషన్ జీవో 252 మేరకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ ఇచ్చే అవకాశం ఉండడంవల్ల ఇతరులు నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన పత్రికల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సంస్థల నుంచి ఇచ్చిన సిఫార్సు లేఖలలో పేర్లు కలిగి ఉండి జీవో మేరకు అర్హులు కాని వారిని గుర్తించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
జిల్లాలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల అంశంలో అన్యాయం జరగకుండా చూస్తామని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. జర్నలిస్టుల బృందం చేసిన విజ్ఞప్తి మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవిచంద్ర, జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు రామారావు, రవీందర్, రామకృష్ణ, బాల్ రెడ్డి, సునీల్, శ్రీరాములు, రచ్చ శ్రీనివాస్, హనుమంత రెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు భూపాల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






