23 June, 2026 | 2:33 AM

ఇంటింటికీ ప్రజా ప్రభుత్వ సంక్షేమం

23-06-2026 12:31 AM

పదేళ్ల గత పాలకుల నిర్లక్ష్యానికి చెక్

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు అండ

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపీట

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 

గత పాలకుల పదేళ్ల నిరంకుశ పాలనలో పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికా రంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తుచే శారు. ‘గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లు కేటాయించాం’ అన్నారు.

పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నా మని చెప్పారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు వివరించారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కేవలం రెండున్నర ఏళ్లలోనే రూ.67,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు. వడ్డీ లేని రుణ పరిమితిని సైతం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేం దుకు పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంన్లు, 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వివరించారు.

గత పదేళ్లుగా పార్టీ కోసం రోడ్లపైకి వచ్చి, ధర్నాలు, ఉద్యమాలు చేసిన ప్రతి ఒక్క మహిళా నాయకురాలికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని  స్పష్టం చేశారు. కష్టపడిన వారి వివరాలు జిల్లాల వారీగా తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు  అందరికీ సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూసే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నేను (ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క) తీసుకుంటామని భరోసా ఇచ్చా రు.  రాష్ర్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో మహిళలు చురుగ్గా పాల్గొని, అర్హుల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. 

కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.