25-07-2025 06:06:56 PM
870 లీటర్ల స్పిరిట్,100 కాటన్ల నకిలీ మద్యం
ఒక స్కూటీ,ఒక కారు,ఒక ట్రాక్టర్ సీజ్..
హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి
హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం నకిలీ మద్యం కేసు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఎక్సైజ్ పోలీసులు... శుక్రవారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా నకిలీ మధ్యాన్ని తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు చేసి ఈ కేసులో 16 మంది నిందితులకుగాను 13 మందిని అరెస్టు చేశారు. మేళ్లచెరువు మండలం రామాపురం శివారులో రైస్ మిల్లు కు సంబంధించిన గోడౌన్ లో గత రెండు నెలల క్రితం నుండి నకిలీ మద్యాన్ని తయారుచేసి పక్క పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణలో పలు బెల్టు షాపులకు భారీగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ఈముఠా దాదాపుగా రూ. రెండు కోట్లు విలువైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.గతంలో ఇలాగే నకిలీ మద్యాన్ని తయారుచేసి ఆంధ్రలో పలు ప్రాంతాలకు తరలించి డబ్బుదండుకున్న నిందితులు రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని పక్క ప్లాన్ ప్రకారం భారీగా నకిలీ మద్యాన్ని తయారు చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.ఈ వ్యవహారానికి సంబంధించి గోడౌన్ లో నకిలీ మద్యాన్ని తయారు చేసే రిక్వైర్డ్ స్పిరిట్, ఖాళీ క్వార్టర్ సీసాలు,లేబుల్స్, మూతలు భారీగా సమకూర్చుకున్నట్లు ఎక్సైజ్ శాఖకు వచ్చిన సమాచారం మేరకు హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు, జిల్లా టాస్క్ పోర్స్ అధికారులతో కలసి నిర్వహించిన దాడుల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
పట్టుకున్నటు వంటి నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలలో అన్ని వైన్ షాపులతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 870 లీటర్ల స్పిరిట్ 100 కాటన్ ల నకిలీ మద్యం ఒక స్కూటీ,ఒక కారు,ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు తోట శివ శంకర్ కోర్టులో లొంగిపోయాడని మేళ్లచెర్వులోని శివ పార్వతి వైన్స్ 2 నందు కౌంటర్ లో పనిచేస్తున్నందున వైన్ షాప్ ను సస్పెండ్ చేయడం తో పాటు మూసివేసి సీల్ వేశామన్నారు.