calender_icon.png 24 November, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

24-11-2025 10:53:32 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,000 రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇంచార్జి) ఎస్. సరిత సోమవారం తీర్పును వెలువరించారు. బూర్గంపాడు మండలం,సారపాక గాంధీనగర్ కు చెందిన మైనర్ అమ్మాయిపై అదే గ్రామానికి చెందిన కల్తీ వెంకటేశ్వర్లు అను వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు 2020 డిసెంబర్ 12వ తేదీన ఫిర్యాదు అందుకున్న బూర్గంపాడు స్టేషన్ హౌస్ అధికారి బి.బాలకృష్ణ కేసు నమోదు చేశారు. ఇట్టి కేసులో విచారణాధికారిగా అప్పటి సబ్ డివిజన్ పోలీస్ అధికారి కేఆర్కే ప్రసాదరావు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టులో మొత్తం 10 మంది సాక్షులను విచారించిన పిదప నిందితుడు కల్తీ వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కాగా ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల మూడు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవిడి లక్ష్మీ, కోర్టు నోడల్ అధికారి ఎస్సై డి.రాఘవయ్య, లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి మహమ్మద్ అక్రమ్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.