24-11-2025 10:18:05 PM
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం..
దవాఖానకు వచ్చేందుకు జంకుతున్న రోగులు..
కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత లోపించి పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి. దవాఖాన మెయిన్ డోర్ ముందు పిచ్చి మొక్కలు పెరిగి బంజరు దొడ్డిలా దర్శనమిస్తోంది. దవాఖాన ముందు ఏర్పాటు చేసిన సూచిక బోర్డు వంగి పోయినా పట్టించుకున్న వారు లేరు. దవాఖానకు ప్రతి రోజు వచ్చే రోగులు, నెలకోసారి వచ్చే గర్భిణీలు, బాలింతలు ముక్కుమూసుకుంటున్నారు. రోగాలకు చికిత్స అందించడం మాటేమో గానీ ప్రజలకు మరిన్ని రోగాలు ప్రబలేటట్టు ఉన్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. దవాఖాన లో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి.
తాగునీటి వసతి, టాయిలెట్స్, యూరినల్స్ లేక రోగులు, మహిళా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లపై చద్దర్లు లేక వాసన వ్యాపిస్తోందని దవాఖాన లోపల ఊడ్చి, ఫినాయిల్ తో శుభ్రం చేయడం లేదన్న విమర్శలున్నాయి. రెండు వార్డులు ఉన్నా వాటికీ అద్దాలు పగిలిపోయి బయటినుండి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో రోగులు దవాఖానలో ఉన్నంత సేపుఅసహనం తో గడుపు తున్నట్లు రోగులు వాపోతున్నారు. పేరుకే "రౌండ్ ది క్లాక్ ఆసుపత్రి" ఏనాడూ 24 గంటలు సేవలు అందించిన దాఖలాలు లేవు.
మండలంలో 30 వరకు గిరిజన తండాలు గ్రామాలున్నాయి. ఇక్కడ సేవలందక ప్రైవేటు RMP PMP లను ఆశ్రయించి రోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఉండాల్సి ఉండగా ఒక వైద్యుడు, ఒక మేల్ స్టాఫ్ నర్సు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన ఉన్నా పేదవారికి కనీస వైద్యం, కనీస సౌకర్యాలు అందక పోవడం విడ్డురంగా ఉంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులతో పాటు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్నారు.