24-11-2025 10:20:57 PM
హనుమకొండ (విజయక్రాంతి): హసన్పర్తి మండల కేంద్రంలోని టిటిఎస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎక్సైజ్ స్టేషన్ సీఐ దుర్గాభవాని ని కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ఈ స్టేషన్ పరిధిలో వచ్చే ప్రాంతాలను అధికారాలలను అడిగి తెలుసుకుని డ్రగ్స్, గంజాయి, గుడుంబా వంటివి లేకుండా నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులకు సూచన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... హాసన్పర్తి టౌన్ లో ఎక్సైజ్ స్టేషన్ ఏర్పాటుకు చేసేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని, విద్యార్థులు, యువత మత్తును వదిలి మైదానాల్లోకి రావాలని, గంజాయి, మత్తుపదార్థాల వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయని, యువత వాటికి దూరంగా ఉండాలన్నారు.తాను అడిషనల్ డీసీపీ, నిజామాబాద్ సీపీగా ఉన్నప్పుడు ప్రత్యేక టీమ్స్ వేసి మత్తు పదార్థాల నివారణకు కృషి చేశామని చెప్పారు. మత్తు పదార్థాల నివారణకై ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసిందని, ఎక్సైజ్ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని అన్నారు.
హసన్పర్తి సమీపంలో అనేక కళాశాలలు ఉన్నాయని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఎక్సైజ్ అధికారులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రగ్స్, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలన్నారు.ప్రజల రక్షణ, శాంతి భద్రతల కోసం ఎక్సైజ్ శాఖ కీలకంగా పనిచేస్తోంది. అక్రమ మద్యం రవాణా, నకిలీ మద్యం తయారీ, గూడ్స్ స్మగ్లింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు ఈ నూతన ఎక్సైజ్ స్టేషన్ మరింత బలంగా సేవలందిస్తుంది. ప్రజల సహకారం, అధికారుల కృషి ఉంటే మండలాన్ని పూర్తిగా అక్రమాల రహితంగా మార్చడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ పథకాలను, చట్టాలను ప్రజలకు చేరవేయడంలో ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, హాసన్పర్తి, ఐనవోలు మండలాల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మహేష్ గౌడ్, పాక్స్ చైర్మన్ చల్లా గోపాల్ రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, మండల మహిళ అధ్యక్షురాలు జోరిక పూలక్క, బత్తుల స్వాతి, సీనియర్ నాయకులు కార్యకర్తలు, ఎక్సైజ్ వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ డిపిఓ వరంగల్ అర్బన్ చంద్రశేఖర్, స్థానిక ఎక్సైజ్ సిఐ దుర్గా భవానీ, ఎస్ఐ వెంకన్న, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.