10-07-2025 07:27:35 PM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ద్వారా విద్యా బోధన చేసి వెనుకబడిన విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్ధ్యాలను సాధించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. గురువారం వాంకిడి మండలం బెండర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, వంటశాల, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుందని, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెనుకబడిన విద్యార్థులలో అభ్యాసనా సామర్ధ్యాలను పెంపొందించాలని తెలిపారు.
ప్రత్యక్షంగా కంప్యూటర్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ బోధన పద్ధతిపై ప్రదర్శన ద్వారా వివరించారు. విద్యా బోధన విధానం, గణితం సాధన, భాషను తెలుసుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తరగతి నిర్వహణపై వివరించారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం నాణ్యత గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, మండల విద్యాధికారి శివ చరణ్ తదితరులు పాల్గొన్నారు.