10-07-2025 07:30:11 PM
కమిషన్ ఆఫ్ హార్టికల్చర్, జిల్లా ప్రత్యేక అధికారి అజ్మీరా ప్రేమ్ సింగ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉద్యాన, వాణిజ్య పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కమిషన్ ఆఫ్ హార్టికల్చర్, జిల్లా ప్రత్యేక అధికారి అజ్మీర ప్రేమ్ సింగ్(District Special Officer Ajmira Prem Singh) అన్నారు. గురువారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎండి అబ్దుల్ నదీమ్ కుద్దుసి, కాగజ్ నగర్ ఉద్యాన అధికారి సుప్రజ, మ్యాట్రిక్స్ కంపెనీ సి.ఈ.ఓ. ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ ఆఫ్ హార్టికల్చర్ మాట్లాడుతూ.. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేసేలా, సాగు విధివిధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లాలో దీర్ఘకాలిక పండ్ల తోటలైన మామిడి, జామ, నిమ్మ, పనస, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ సాగుతోపాటు ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం తరఫున రాయితీలు అందించడం జరుగుతుందని తెలిపారు. అంతర్ పంటలుగా కూరగాయలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ నుండి కూరగాయల సాగుకు 50 శాతం, శాశ్వత పందిరి, మల్చింగ్ సాగుకు 50 శాతం, బిందు సేద్య పరికరాలలో 90 శాతం, స్ప్రింక్లర్లు, తుంపర సేద్య పరికరాలలో 75 శాతం, వెదురు సాగుకు 75 శాతం, ఫామ్ మెకనైజేషన్ క్రింద ఉద్యాన పంటలకు గాను పవర్ విడర్, పవర్ టిల్లర్, నాప్ సాక్ స్ప్రేయర్, బ్రష్ కట్టర్ లపై 40 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం రైతుల కొరకు అందించే పథకాలను రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా వివరాలు తెలియచేయాలని, నాణ్యత గల ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులకు అందించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ఉద్యాన, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని తెలిపారు. ఉద్యాన శాఖ పథకాల లక్ష్యాలను పూర్తిగా సాధించాలని, పంట సాగులో రైతులకు అవసరమైన మెలకువలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.