calender_icon.png 13 September, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆసుపత్రులపై చర్యలు

13-09-2025 03:17:00 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 12 :(విజయ క్రాంతి):  ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో  డిస్పోస్ చేయని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.

ప్రతి రోజు ఎన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగుతుండగా, సగానికి పైగా ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మెడికల్ వేస్టేజీ విషయంలో నిబంధనలు అమలు చేయకపోతే అలాంటి ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. ఏజెన్సీ పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరపాలని కాలుష్య నియంత్రణ మండలి ఏ.ఈ మానసను ఆదేశించారు. 

 సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ చేసిన కలెక్టర్ 

కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్-1 లో గల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సి.డీ.ఎస్)ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సి.డీ.ఎస్ లో రికార్డులలో పొందుపరచిన దానికి అనుగుణంగానే ఔషధ నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.

ఔషధాలను ఎక్కడి నుండి సమకూరుస్తారు, సి.డీ.ఎస్ ద్వారా వివిధ పీ.హెచ్.సిలకు వాటిని ఎలా చేరవేస్తారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలని, ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలె ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్‌ను ఆదేశించారు.